Chandrababu Naidu: ఒక్క దిక్కుమాలిన వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసింది: సీఎం చంద్రబాబు

‘పార్లమెంటులో 50 పార్టీలు ఉంటే, అందులో 49 పార్టీలు అమరావతికి మద్దతు పలికితే, ఒక్క దిక్కుమాలిన వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసింది’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యర్థి పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజధాని ఏదంటే ‘అమరావతి’ అని గర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందని, గత పాలకులు ఆడిన మూడు ముక్కలాట ముగిసిందని అన్నారు. అనంతపురం జిల్లా యాడికిలో సోమవారం జరిగిన ‘జలధార.. నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమరావతి పేరు పలకడానికి కూడా ఇష్టం లేని కొందరు పిచ్చి ముదిరి 'మావిగన్’ అంటూ కొత్త పేరుతో పిలుస్తున్నారని, వారి ఫ్రస్టేషన్ చూస్తుంటే జాలి వేస్తోందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి ద్రోహం చేసిన ఏకైక పార్టీ వైసీపీ
గత ప్రభుత్వ వైఖరిని దుయ్యబడుతూ, రాష్ట్రంపై పగ పట్టినట్లుగా వ్యవహరించారని చంద్రబాబు ఆరోపించారు. ‘‘బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టిన వాళ్లు ఎలాంటి రాజకీయమైనా చేస్తారు. అమరావతి పనులు వేగంగా జరుగుతుంటే చూసి సహించలేక అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. ఫ్యాక్షనిస్టులు, ముఠా నాయకుల కంటే ఘోరంగా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు’’ అని మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని అమరావతేనని పార్లమెంట్ చట్టబద్ధత కల్పించడంపై సీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, సభకు హాజరైన ప్రజలు ‘జై అమరావతి’ నినాదాలతో తమ మద్దతు తెలిపారని గుర్తుచేశారు.

పెట్టుబడులు వస్తుంటే ఓర్వలేకపోతున్నారు
గత పాలకులు రాష్ట్రంపై విద్వేషం చూపిస్తున్నారని, పెట్టుబడులు వస్తుంటే వారిని బెదిరించి తరిమేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుంది. దేవాలయాలపై దాడులు చేసి, తిరుమల ప్రసాదం నాణ్యతను కల్తీ నెయ్యితో దెబ్బతీశారు. ఇలాంటి వారికి సహకరిస్తే ప్రజలందరికీ నష్టం జరుగుతుంది,’’ అని హెచ్చరించారు. గత ప్రభుత్వం పెంచిన రూ.4,400 కోట్ల విద్యుత్ భారాన్ని కూడా కూటమి ప్రభుత్వమే భరిస్తోందని, తొలిసారి ట్రూ డౌన్ చేసిన ఘనత తమదేనని స్పష్టం చేశారు.

జలధారతో ప్రతీ ఎకరాకు నీరు
అంతకుముందు, ‘జలధార’ కార్యక్రమం కింద 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను, ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. నీరే సంపద అని, దాన్ని పొదుపుగా వాడితేనే సంపద సృష్టించగలమని అన్నారు. ‘‘పరిగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని జలాశయాల్లో నిల్వ చేయాలి. నీరు-చెట్టు, పంట కుంటలు, డ్రిప్ ఇరిగేషన్ వంటి కార్యక్రమాలతో గతంలోనే నీటి సంరక్షణకు బాటలు వేశాం. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందించి రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చాం. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్‌లో రూ.1,031 కోట్లు వ్యయం చేస్తూ దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నాం,’’ అని వివరించారు.

పూర్వోదయతో సీమకు మహర్దశ
రాయలసీమ అభివృద్ధికి ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, కేంద్రం ప్రవేశపెట్టిన ‘పూర్వోదయ’ పథకం ద్వారా రూ.30 వేల కోట్లు, పెట్టుబడుల ద్వారా మరో రూ.70 వేల కోట్లు సమీకరించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘గడిచిన 21 నెలల్లో చేపట్టిన జలసంరక్షణ చర్యల వల్ల రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు 1.92 మీటర్ల మేర పెరిగాయి. ఒక్క అనంతపురం జిల్లాలోనే 2.2 మీటర్ల పెరుగుదల కనిపించింది. 20 వేలకు పైగా ఎండిన బోర్లలో నీళ్లు వచ్చాయి. రూ.96 కోట్ల విద్యుత్ ఆదా అయ్యింది’’ అని తెలిపారు. శ్రీశైలం నుంచి ఎత్తిపోతల ద్వారా నీరు తెచ్చి, పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు ఇచ్చి, ఆదా చేసిన నీటిని సీమకు తరలించామని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Amaravati
YSRCP
Jaladhara Scheme
Water Conservation
Rayalaseema Development
Irrigation Projects
Pattiseema Project
Anantapuram District

More Telugu News