Chandrababu Naidu: బాబూ జగ్జీవన్ రామ్‌కు సీఎం చంద్రబాబు ఘన నివాళి

భారత మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆజన్మాంతం కృషి చేసిన ధీరుడని ఆయన కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబు ఆదివారం సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు.

విద్యార్థి దశ నుంచే అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించి, ప్రజలలో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప సామాజిక సంస్కర్త బాబూ జగ్జీవన్ రామ్ అని చంద్రబాబు ప్రశంసించారు. "సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్‌గా పనిచేసి చట్టసభల్లో తన సత్తా చూపిన ఆయన, ఆఖరి క్షణం వరకూ దళిత జాతి సముద్ధరణ కోసమే తపించారు" అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళి అర్పిస్తున్నానని, ఆయన స్ఫూర్తిని భావి తరాలు ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Chandrababu Naidu
Babu Jagjivan Ram
Andhra Pradesh
Dalit leader
Indian politician
Social reformer
Tribute
Jayanti
Independence Activist
Political News

More Telugu News