తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు!

Tirumala Temple Sees Huge Rush Devotees Wait 30 Hours for Darshan
  • బుధవారం 7 గంటల పాటు సర్వదర్శనం క్యూలైన్ తాత్కాలికంగా నిలిపివేత
  • స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ముగుస్తుండటంతో పెరిగిన రద్దీ
  • నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడం, పరీక్షల ఫలితాలు వెలువడటంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తిరుమల గిరులు భక్తజన సంద్రంగా మారాయి. రద్దీ అనూహ్యంగా పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.

నిన్న మధ్యాహ్నం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో, టీటీడీ అధికారులు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం క్యూలైన్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. తిరిగి రాత్రి 8 గంటలకు భక్తులను క్యూలైన్లలోకి అనుమతించారు. ఈరోజు ఉదయం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు ఆక్టోపస్ భవనం వరకు బారులు తీరాయి.

ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 30 గంటలు, టోకెన్లు ఉన్నవారికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం ఒక్కరోజే 86,315 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 44,107 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.94 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్లలోని భక్తులకు అన్నపానీయాలు అందిస్తూ, ఎండల తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటోంది.
 
Go Back to Shorts
Tirumala
Tirumala Temple
TTD
Tirupati
Srivari Darshan
Rush
Devotees
Summer Holidays
Vaikuntam Queue Complex

More Telugu News