Iran oil imports: ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లు.. కేంద్రం కీలక ప్రకటన

Iran Oil Imports Resume After 7 Years Center Announcement
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్ తిరిగి ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోళ్లను ప్రారంభించింది. సుమారు ఏడేళ్ల విరామం తర్వాత ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ప్రకటించింది. అమెరికా ఒత్తిడి కారణంగా 2019 మే నెల నుంచి భారత్, ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నిలిపివేసిన విషయం తెలిసిందే.

పశ్చిమాసియాలో సరఫరా సమస్యలు తలెత్తినప్పటికీ, భారత రిఫైనరీలు తమకు అవసరమైన ముడి చమురును ఇరాన్‌తో సహా పలు దేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్నాయని పెట్రోలియం శాఖ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలిపింది. ఇరాన్ నుంచి దిగుమతులకు చెల్లింపుల విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. ఇటీవలే అమెరికా, ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా సడలించడంతో ఈ కొనుగోళ్లకు మార్గం సుగమమైంది.

రాబోయే నెలలకు దేశానికి అవసరమైన పూర్తిస్థాయి ముడి చమురు నిల్వలను ఇప్పటికే భద్రపరిచినట్లు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా 40కి పైగా దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునే వెసులుబాటు భారత కంపెనీలకు ఉందని వివరించింది.

ఇదే క్రమంలో ఇరాన్ నుంచి 44,000 మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ)ను కూడా భారత్ కొనుగోలు చేసింది. ఈ గ్యాస్‌తో కూడిన నౌక బుధవారం మంగళూరు పోర్టుకు చేరుకోగా, ప్రస్తుతం ఇంధనాన్ని అన్‌లోడ్ చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


Go Back to Shorts
Iran oil imports
Iran
India Iran
crude oil
LPG
oil supply
oil imports India
Petroleum Ministry
Mangalore port
West Asia

More Telugu News