Buddha Venkanna: అమరావతి అంటే అప్పు కాదు... 5 కోట్ల ఆంధ్రులకు ఆక్షయపాత్ర: బుద్ధా వెంకన్న

అమరావతి రాజధాని అప్పుల కుప్ప కాదని, అది 5 కోట్ల ఆంధ్రులకు అక్షయపాత్ర అని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. భూకబ్జాలు, అవినీతికి వైసీపీనే కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్, వైసీపీ నేతల తీరును ఎండగట్టారు. తాడేపల్లి ప్యాలెస్ పెత్తందారుడి అవినీతిని కప్పిపుచ్చి, ఆ పాపాన్ని చంద్రబాబుకు అంటగట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కో ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

రాజధానిపై వైసీపీలో గందరగోళం
అమరావతి అంశాన్ని వైసీపీ నేతలు ఒక మ్యూజికల్ చైర్ గేమ్‌గా మార్చేశారని బుద్ధా వెంకన్న విమర్శించారు. ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి వద్దు అంటుంటే, మరోవైపు బొత్స సత్యనారాయణ రాజధానిని పూర్తి చేయాలని అంటారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి మూడు రాజధానులు, మెంటల్ గన్ అంటూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని, ఒక విధానమంటూ లేని పార్టీ వైసీపీ అని దుయ్యబట్టారు. అమరావతిపై విషం చిమ్మడం అంటే రాష్ట్ర యువత భవిష్యత్తుపై దాడి చేయడమేనని ఆయన హెచ్చరించారు.

అమరావతి అప్పు కాదు.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్
రాజధాని ఖర్చు ప్రజలపై పడుతుందంటూ సజ్జల చెబుతున్నది అతిపెద్ద డ్రామా అని వెంకన్న కొట్టిపారేశారు. "అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూముల విలువ సుమారు రూ. 3 లక్షల కోట్లు. నాడు చంద్రబాబు హైదరాబాద్‌లో ఎకరం లక్ష రూపాయల భూమిని రూ. 150 కోట్లకు ఎలా చేర్చారో, అమరావతిని కూడా అదే స్థాయి గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడి మిగులు భూముల ద్వారా వచ్చే నిధులతో రాజధానిని నిర్మించడమే కాకుండా, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను అభివృద్ధి చేయవచ్చు. ప్రభుత్వ నిధులతో పనిలేకుండా సంపద సృష్టించే మ్యాజిక్ అమరావతి సొంతం" అని ఆయన వివరించారు.

భూకబ్జాలపై మాట్లాడేందుకు వైసీపీకు అర్హత లేదు
భూముల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదని బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు 500 ఎకరాలతో ఐటీ రంగాన్ని తెచ్చి 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే, జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 5.30 లక్షల ఎకరాల భూములను కబ్జా చేసి ఒక్క ఉద్యోగమైనా ఇవ్వలేదని ఆరోపించారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు 8,000 ఎకరాలు, ఇడుపులపాయలో 600 ఎకరాల అసైన్డ్ భూములు, కడప, స్వర్ణముఖి ఫారెస్ట్ భూములను వైకాపా నేతలు కబ్జా చేశారని ఆయన ఆరోపణలు చేశారు. కబ్జా సంస్కృతి వైసీపీది అయితే, కల్పతరువు లాంటి అభివృద్ధి సంస్కృతి టీడీపీదని స్పష్టం చేశారు.

నిర్మాణ ఖర్చులపై చర్చకు సిద్ధమా?
జగన్ రెడ్డి తన విలాసం కోసం రుషికొండలో పర్యావరణాన్ని నాశనం చేసి, చదరపు అడుగుకు రూ.35,000 ఖర్చుతో రెండంతస్తుల భవనం కట్టారని, అదే అమరావతిలో 50 అంతస్తుల భవనాన్ని చదరపు అడుగుకు కేవలం రూ.6,000తో నిర్మిస్తుంటే బురదజల్లుతారా అని ప్రశ్నించారు. రుషికొండ ప్యాలెస్, అమరావతి నిర్మాణ ఖర్చులపై చర్చకు వైకాపా నేతలు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు.

రాజధానికి సంపూర్ణ చట్టబద్ధత
ఇన్నాళ్లు రాజధానికి చట్టబద్ధత లేదని మాట్లాడటం వైసీపీ నేతల అవగాహనారాహిత్యానికి నిదర్శనమని వెంకన్న అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులతో పాటు ఇప్పుడు పార్లమెంట్ చట్టం ద్వారా అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించిందని తెలిపారు. ఇది పెట్టుబడిదారుల్లో కొండంత విశ్వాసాన్ని నింపిందని, 175 నియోజకవర్గాల యువతకు కల్పతరువుగా మారుతుందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే జగన్‌కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని, చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగి తీరుతుందని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు.


Buddha Venkanna
Amaravati
Andhra Pradesh
YS Jagan Mohan Reddy
Capital City
TDP
YSCP
Land Pooling
Real Estate
Political News

More Telugu News