Sabitha Indra Reddy: కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి.. తీవ్రంగా స్పందించిన సబితా ఇంద్రారెడ్డి

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఫొటోతో క్యాంప్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు, అక్కడ ముఖ్యమంత్రి ఫొటోను ఉంచారు. అనంతరం కార్యాలయంలో జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడిని సబితా ఇంద్రారెడ్డి ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యల కారణంగానే కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. మా దగ్గర కూడా కండలు తిరిగినవాళ్లు ఉన్నారంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి రౌడీ మాటలు మాట్లాడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.

కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండేవని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై పట్టపగలే దాడులు జరుగుతుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆరోపించారు. ఈ దాడికి పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Sabitha Indra Reddy
Gajwel
KCR
Revanth Reddy
BRS
Congress
Telangana Politics
MLA Camp Office Attack

More Telugu News