Harish Rao: కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని, ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆయన ఆరోపించారు.

హరీశ్ రావు మాట్లాడుతూ.. "పట్టపగలే అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు బీహార్ గ్యాంగ్‌లను తలపిస్తోంది. ప్రజాప్రతినిధుల కార్యాలయాలపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్టా, లేనట్టా?" అని ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిందా? అని నిలదీశారు.

"ఒకవైపు ‘హేట్ స్పీచ్ బిల్’ పేరుతో ప్రతిపక్షాల నోరు నొక్కుతూ, మరోవైపు తమ గూండాలతో దాడులు చేయించడమేనా ప్రజా పాలన? ఇందిరమ్మ రాజ్యం పేరుతో గూండా రాజ్యాన్ని అమలు చేస్తారా?" అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉంటూ, ఇక్కడి పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా అనే అనుమానం కలుగుతోందని అన్నారు.

కాంగ్రెస్ అణచివేతలకు, దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు, బెదరదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఆగకపోతే ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
Harish Rao
KCR
Revanth Reddy
BRS
Telangana politics
Gajwel
Congress party
Political attack
Law and order
Telangana government

More Telugu News