Andhra Pradesh: భర్త ఆత్మహత్య ప్లాన్.. భార్య అలర్ట్‌తో నిలిచిన నాలుగు ప్రాణాలు

పల్నాడు జిల్లాలో అప్పుల బాధతో ఓ కుటుంబం తీసుకున్న తీవ్ర నిర్ణయం విషాదాంతం కాకుండా పోలీసులు అడ్డుకున్నారు. భార్యాపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు కారులో బయల్దేరిన వ్యక్తిని చివరి నిమిషంలో నిలువరించి, నలుగురి ప్రాణాలను కాపాడారు. పోలీసులు సకాలంలో స్పందించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అస‌లేం జ‌రిగిందంటే..! 
దుర్గికి చెందిన శ్రీపతి అమరేంద్ర, త్రివేణి దంపతులకు ఇద్దరు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ జీవించే అమరేంద్ర, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. అవి తీర్చలేని స్థాయికి చేరడంతో రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతడు, కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం రాత్రి పిల్లల ఆరోగ్యం బాగాలేదని, గుంటూరు ఆసుప‌త్రికి వెళ్దామని భార్యను నమ్మించాడు. దారిలో కారులో వెళుతుండగా తన ఆత్మహత్య ఆలోచనను భార్యకు చెప్పాడు.

భర్త మాటలతో తీవ్ర ఆందోళనకు గురైన త్రివేణి, చాకచక్యంగా వ్యవహరించి తన కుటుంబసభ్యులకు రహస్యంగా సమాచారం అందించింది. వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కారు గుంటూరు వైపు ఉప్పలపాడు బైపాస్‌లో వెళుతున్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని ఎస్ఆర్కేటీ కాలనీ సమీపంలోని బ్రిడ్జి వద్ద కారును అడ్డగించారు.

పోలీసులను చూసి అమరేంద్ర షాక్ అవ్వగా, భార్య త్రివేణి ఊపిరి పీల్చుకుంది. పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి, ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని నచ్చజెప్పారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పిలిపించి నలుగురినీ సురక్షితంగా అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల పనితీరును పలువురు అభినందిస్తున్నారు.


Andhra Pradesh
Sripati Amarendra
Palnadu district
debt
suicide attempt
family suicide
police intervention
Uppalapadu bypass
Guntur hospital
SRKT Colony

More Telugu News