Hyderabad Mangoes: హైదరాబాద్‌లో కల్తీ మామిడి పండ్ల దందా.. 200 కిలోలు సీజ్, వ్యాపారి అరెస్ట్!

వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. కానీ, ఇదే అదనుగా కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్‌లో రసాయనాలతో కృత్రిమంగా పండించిన 200 కిలోల మామిడి పండ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు కలిసి పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక పండ్ల వ్యాపారిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. కాయలను త్వరగా పండించి, ఎక్కువ లాభాలు పొందేందుకు 'ఇథిలీన్ రైపెనర్' వంటి రసాయనాలను అనుమతించిన మోతాదుకు మించి వాడుతున్నట్లు అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు. ఇలాంటి పద్ధతులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్యాల్షియం కార్బైడ్ లేదా ఇతర రసాయనాలతో పండించిన పండ్లను తినడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల గొంతు మంట, కడుపునొప్పి, వాంతులు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉందని చెప్పారు.

ఈ విషయంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ ప్రజలకు పలు సూచనలు చేశారు. చూడటానికి పసుపు రంగులో నిగనిగలాడుతూ, పండు అంతా ఒకే రంగులో ఉంటే అది రసాయనాలతో పండినది కావొచ్చని అనుమానించాలన్నారు. సహజంగా పండిన పండుకు ఉండే సువాసన వీటికి ఉండదని తెలిపారు. ఎక్కడైనా ఇలాంటి కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే డయల్ 100 లేదా హెచ్-ఫాస్ట్ వాట్సాప్ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. మామిడి పండ్లను తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టడం ద్వారా రసాయనాల ప్రభావాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Hyderabad Mangoes
Mangoes
Food Safety
VC Sajjanar
Artificial Ripening
Ethylene Ripener
Calcium Carbide
Adulterated Food
Mango Business

More Telugu News