Ambati Rambabu: అమరావతి నిర్మాణం అసాధ్యం.. మావిగనే అభివృద్ధి మంత్రం: అంబటి రాంబాబు

Ambati Rambabu Says Amaravati Construction Impossible Focus on Mavigan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావడం అసాధ్యమని, ఇది ఎప్పటికీ ముగియని కథ అని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి "మావిగన్" (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) కారిడారే అసలైన మంత్రమని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో అంబటి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిన్న మాజీ మంత్రి విడదల రజని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. "అమరావతి అభివృద్ధికి రూ.2 లక్షల కోట్లు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా చెప్పారు. అంత పెద్ద మొత్తంతో రాజధానిని నిర్మించడం రాష్ట్రానికి పెనుభారంగా మారుతుంది. అది పూర్తయ్యే పథకం కాదు" అని ఆయన అన్నారు. దీనికి బదులుగా, ఇప్పటికే అభివృద్ధి చెందిన మావిగన్ ప్రాంతాన్ని కేవలం రూ.20 వేల కోట్లతో మరింత అభివృద్ధి చేయవచ్చని సూచించారు.

రాజకీయ పరిజ్ఞానం ఉంటే గుంతలో రాజధాని ఎందుకు పెడతారు? వర్షం వస్తే నిండిపోయే చెరువులాంటి అమరావతిలో రాజధాని కట్టడమేంటి? అని అంబటి ప్రశ్నించారు. అమరావతి కేవలం 217 చదరపు కిలోమీటర్లకే పరిమితమని, కానీ మావిగన్ దాదాపు 60 లక్షల జనాభాతో విస్తరించి ఉందని వివరించారు. రాజధాని పరిరక్షణకు చట్టం తెచ్చామని చెబుతున్నారని, ఒకవేళ వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారు మరో చట్టం చేయలేరా? అని ఆయన వ్యాఖ్యానించారు.
 
Go Back to Shorts
Ambati Rambabu
Amaravati
Andhra Pradesh
MAVIGAN
Machilipatnam
Vijayawada
Guntur
AP Capital
Vidudala Rajini
Chilakaluripeta

More Telugu News