Nimmala Ramanayudu: ఏపీలో ఇరిగేషన్ పనుల అంచనాల తయారీలో అధికారుల అలసత్వం..అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం

గతంలో ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా కాకుండా, ఇరిగేషన్ అధికారులు తీరు మార్చుకోవాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి నిమ్మల నియోజకవర్గాల వారీగా కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత, వంటి పనులకు సంబందించిన అంచనాల తయారీపై సమీక్ష నిర్వహించారు. ఆయా పనులకు సంబంధించి మార్చి 25వ తేదీలోపు నియోజకవర్గాల వారీగా అంచనాలు రూపొందించి పంపించాలని ఆదేశించినా, ఇప్పటి వరకు కొంత మంది చీఫ్ ఇంజనీర్లు సరిగా అంచనాలు సమర్పించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, మట్టి పూడిక తీత వంటి పనులు చేయడానికి ఏప్రియల్, మే, నెలలో మాత్రమే అవకాశం ఉంటుందని,  ఆతరువాత ఖరీఫ్ సీజన్ మొదలైతే పనులు చేయడానికి అవకాశం ఉండదన్నారు. గతంలో ఏప్రియల్, మే నెలలో చేయాల్సిన పనులకు జూన్ లో అనుమతులు ఇచ్చేవారని, పనులు మొదలుపెట్టిన వెంటనే కాలువలకు నీళ్ళు వదిలేవారని, దీంతో పనులు సగంలోనే వదిలేయాల్సి వచ్చేదని గుర్తు చేశారు. 

ఇలా చేయడం వల్ల ఆయకట్టు చివరన ఉన్న పొలాలకు సాగు నీరందక రైతులు ఇబ్బందిపడాల్సి వస్తుందని, ఇలా గతంలో వ్యవహరించిన తీరులో కాకుండా ముందుగానే అంచనాలు రూపొందించి, ఆర్దిక శాఖ అనుమతులు పొందితే సీజన్ మొదలయ్యేలోగా పనులు కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. కావున నియోజకవర్గాల వారీగా పనులకు సంబందించిన అంచనాలను ఆదివారం సాయంత్రం లోగా పంపాలని సిఈలను ఆదేశించారు. గడువులోగా అంచనాలను పంపని అధికారులు సోమవారం అమరావతి సచివాలయంకు వచ్చి అంచనాలు ఎందుకు పంపలేకపోయారో సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యవసర పనుల కింద నిధులు విడుదల చేసి, కాలవల్లో పూడిక తీత, తూడు, గుర్రపుడెక్క తొలగింపు వంటి పనులను చేయడం ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీరందించగలిగామని తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో కనీస నిర్వహణ పనులు సైతం పట్టించుకోకపోవడంతో ఆయకట్టు చివరి ఎకరం వరకు నీరందక రైతులు ఇబ్బంది పడ్డారని, నేడు కూటమి ప్రభుత్వం ప్రతి ఎకరాకు సాగు నీరందించడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామని స్పష్టం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వదిలి గడువులోగా ఇరిగేషన్ పనులకు సంబందించిన అంచనాలు సమర్పించి, సీజన్ మొదలయ్యేలోగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
 
Nimmala Ramanayudu
AP Irrigation
Irrigation Projects
Andhra Pradesh
Canal Maintenance
AP Water Resources
Irrigation Estimates
TDP Government
Agriculture
Water Management

More Telugu News