Jupally Krishna Rao: హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ యాత్ర.. 9 నుంచి ప్రారంభం

హైదరాబాద్ నుంచి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సోమశిల మీదుగా సాగే ఈ యాత్రలో కృష్ణానది, నల్లమల అడవుల అందాలను గగనతలం నుంచి వీక్షించే అద్భుత అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థతో కలిసి పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగానే ఈ హెలీ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలను ఈ నెల 9వ తేదీ నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. బెల్-407 మోడల్ హెలికాప్టర్‌ను ఈ యాత్ర కోసం వినియోగించనున్నారు.

ఈ పర్యటన కోసం ఒకరోజు, రెండు రోజుల ప్యాకేజీలను రూపొందించినట్లు తెలుస్తోంది. ఒకరోజు ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి సోమశిల, శ్రీశైలం క్షేత్రాల్లో వీఐపీ దర్శనాలు పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి నగరానికి చేరుకుంటారు. రెండు రోజుల ప్యాకేజీలో వసతి, భోజన సౌకర్యాలతో పాటు అన్ని ఆలయాల్లో వీఐపీ దర్శనాలు కల్పించనున్నారు. ఒక రోజు పర్యటనకు రూ. 1.10 లక్షలు, రెండు రోజుల పర్యటనకు రూ. 1.40 లక్షలుగా ధరలు నిర్ణయించారు.
Jupally Krishna Rao
Srisailam
Hyderabad
Helicopter tourism
Telangana tourism
Somasila
Nallamala forest
Krishna River
Kollapur constituency

More Telugu News