Perni Nani: అధికారుల్లారా.. కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా మీ సంగతి చూస్తా: పేర్ని నాని వార్నింగ్

మచిలీపట్నంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన ఇళ్ల కూల్చివేతలపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు తొత్తులుగా వ్యవహరిస్తూ, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చివేయడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాని, 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని బహిరంగంగా హెచ్చరించారు.

"కొల్లు రవీంద్రకు తొత్తులుగా పనిచేసే ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కొల్లు రవీంద్ర గుర్తుపెట్టుకో.. నువ్వు చెప్పావని ఈ రోజు ఇళ్లు కూల్చేందుకు కాపలాగా వచ్చిన సీఐ, ఎస్సైలను మళ్లీ బందరుకే రప్పిస్తా. వాళ్లనే కాపలాగా పెట్టి, నీ ఇంటిని కూల్చి ఇదే తరహాలో నీకు చూపిస్తా" అని పేర్ని నాని హెచ్చరించారు. 

ఇప్పుడు కూల్చివేతలకు పాల్పడిన అధికారులను ఎక్కడికి వెళ్లినా వదలబోమని, రాష్ట్రంలో ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ బందరు తీసుకొచ్చి కొల్లు రవీంద్ర ఇంటిని కూల్చేస్తామని అన్నారు. జేసీబీలు, గునపాలు తిరగబడితే ఎలా ఉంటుందో కమిషనర్ బాపిరాజు చౌదరికి రుచి చూపిస్తానని తేల్చిచెప్పారు.

అంతటితో ఆగకుండా అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావును ఉద్దేశించి వ్యక్తిగత హెచ్చరికలు చేశారు. "నువ్వు బందరు నుంచి వెళ్లిపోయి రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా నీ ఇంటి సంగతి చూస్తా. అవసరమైతే తెలంగాణకు పారిపోయినా సరే.. అక్కడ కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా నిన్ను తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి నీ ఇంటి సంగతి తేలుస్తా" అని నాని వార్నింగ్ ఇచ్చారు. 

ఈ ఘటనలో ప్రమేయమున్న ఏసీపీ ఇంటికి కూడా సరైన ప్లాన్ లేదని, ఆయన ఇంటి వ్యవహారం కూడా చూస్తానని హెచ్చరించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కూల్చివేతల వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందని, తమ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని పేర్ని నాని స్పష్టం చేశారు.
Perni Nani
Perni Nani warning
Kollu Ravindra
Machilipatnam
house demolition
YS Jagan
Bapi Raju
Gopal Rao
political revenge
Andhra Pradesh politics

More Telugu News