Chandrababu Naidu: ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై సమీక్షించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరా తీశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరపాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారని అడిగారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు కసరత్తు చేశామని, నిధుల లభ్యతను బట్టి చెల్లింపులను జరుపుతున్నామని అధికారులు వివరించారు.

ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చేలా మొత్తంగా రూ.7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీంట్లో భాగంగా ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కింద రూ.1,848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని, అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి సంబంధించిన రూ.76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేశామని వెల్లడించారు.

వీటితో పాటు గ్రాట్యుటీ బకాయిల కింద రూ.3,411 కోట్లు, పెండింగులో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ.1,800 కోట్లు, పోలీస్ శాఖకు సంబంధించి అదనపు సరెండర్ లీవుల నిమిత్తం రూ.223 కోట్ల బిల్లుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందని మరో రెండు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. తల్లికి వందనం తర్వాత ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుపుతోంది ఉద్యోగులకు మాత్రమేనని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిధుల లభ్యతను బట్టి ఉద్యోగుల పెండింగ్ బిల్లుల సహా అన్ని రకాల పెండింగ్ బిల్లులకు చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల విషయంలో జరిగిన పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయి. నాడు ఉద్యోగుల సొంత సొమ్మును కూడా నాటి ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో వారు తీవ్ర ఇబ్బందులుపడ్డారని, తమ నిధుల కోసం ప్రశ్నించిన నేతలపై కేసులు పెట్టి వేధించారనే అంశం చర్చకు వచ్చింది.

ఇదే సమీక్షా సమావేశంలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు, మెటిరియల్ సరఫరా చేసిన వారికి జరపాల్సిన చెల్లింపులపైనా ముఖ్యమంత్రి ఆరా తీశారు. వివిధ శాఖలకు మెటీరియల్ సరఫరా చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రూ.614 కోట్ల బకాయిల చెల్లింపులు జరిపామని అధికారులు తెలిపారు. పనులు చేసిన, మెటిరీయల్ సరఫరా చేసిన వాళ్లకు బిల్లులు చెల్లింపులు జరిపే ప్రక్రియలో చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Chandrababu Naidu
Andhra Pradesh
AP government
employee pending bills
government employees

More Telugu News