Indigo: ఫ్యూయల్ ఛార్జీలు రూ.10 వేల వరకు పెంచుతూ ఇండిగో నిర్ణయం

విమానాల్లో వినియోగించే ఇంధన ధరలు ఇటీవల భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకున్నది. టిక్కెట్లపై వసూలు చేసే ఫ్యూయల్ ఛార్జీలను భారీగా పెంచింది. దేశీయ, అంతర్జాతీయ టిక్కెట్లపై కనిష్ఠంగా రూ.275, గరిష్ఠంగా రూ.10 వేల వరకు పెంచింది. ఈ ఛార్జీలు రేపటి నుంచి (ఏప్రిల్ 2) అమల్లోకి వస్తాయని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ప్యూయల్ (ఏటీఎఫ్) సవరించిన రోజునే ఇండిగో విమానయాన టిక్కెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే.

గత నెల రోజుల్లో ఏటీఎఫ్ ధరలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయని, దీనివల్ల విమానయాన సంస్థ నిర్వహణ వ్యయాలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపుతోందని ఇండిగో తన ప్రకటనలో తెలిపింది. ఇంధన ధరల పెరుగుదలను పూర్తిగా భర్తీ చేయడానికి విమాన ప్రయాణ ఛార్జీలను భారీగా సవరించవలసి ఉంటోందని పేర్కొంది. ప్రయాణికులపై అధిక భారం పడకుండా స్వల్ప మొత్తంలో బదిలీ చేశామని తెలిపింది. ఈ ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది.
Indigo
Indigo Airlines
Flight Tickets
Aviation Turbine Fuel
ATF Price Hike
Fuel Surcharge
Airfare Hike

More Telugu News