Ponguru Narayana: జగన్ వ్యాఖ్యలన్నీ అబద్ధాలే.. అమరావతిపై మంత్రి నారాయణ సమగ్ర వివరణ

మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి నిర్మాణ ఖర్చులు, ఇతర అంశాలపై జగన్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆయన పదేపదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో తాను స్వయంగా అధికారులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నానని, జగన్ మాత్రం నోటికి వచ్చిన లెక్కలు చెబుతున్నారని విమర్శించారు.

అమరావతికి తిరుగులేని చట్టబద్ధత 
అమరావతి రాజధాని విషయంలో జగన్ ఇకపై ఎలాంటి గందరగోళం సృష్టించలేరని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014కు కీలక సవరణ చేసిందని, సెక్షన్ 5, సబ్-సెక్షన్ 2లో అమరావతి రాజధాని ప్రాంతాన్ని (217 చదరపు కిలోమీటర్లు) స్పష్టంగా నిర్వచించిందని తెలిపారు. ఈ చట్టసవరణతో రాజధానిపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చిందని, ఇది రాష్ట్ర ప్రజలకు శుభవార్త అని అన్నారు. గతంలో జగన్ ఆడిన "మూడు ముక్కలాట"కు ఈ సవరణతో తెరపడిందని, ఇకపై ఆయన ఎన్ని వేషాలు వేసినా చెల్లవని వ్యాఖ్యానించారు.

ప్రజాధనంతో కాదు.. ల్యాండ్ పూలింగ్‌తోనే నిర్మాణం 
అమరావతి నిర్మాణానికి రూ. 2 లక్షల కోట్లు అవుతుందని జగన్ చెప్పడం హాస్యాస్పదమని మంత్రి నారాయణ కొట్టిపారేశారు. ప్రజాధనం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే రాజధాని నిర్మాణం జరుగుతుందని పునరుద్ఘాటించారు. "ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ విధానమే దీనికి ఆధారం. రైతుల నుంచి సమీకరించిన భూమిని అభివృద్ధి చేసి, వారికి కొంత వాటా ఇచ్చాక మిగిలిన ప్రభుత్వ భూమిని అమ్మి, ఆ డబ్బుతోనే నిర్మాణాలు చేపడతాం. దీనికోసం ప్రస్తుతం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం. ప్రభుత్వం వద్ద సుమారు 5,000 ఎకరాలకు పైగా భూమి ఉంది. భవిష్యత్తులో దీని విలువ పెరిగాక అమ్మితే, ఆ డబ్బుతో అప్పులు తీర్చడమే కాకుండా, రాష్ట్రానికి అదనపు ఆదాయం కూడా వస్తుంది" అని ఆయన వివరించారు.

ఆర్థిక వృద్ధి కేంద్రంగా అమరావతి
అమరావతి కేవలం పరిపాలనా రాజధాని కాదని, రాష్ట్రానికి ఒక ఆర్థిక చోదక శక్తి (ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్)గా మారబోతోందని నారాయణ ధీమా వ్యక్తం చేశారు. "ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 70 శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వస్తోంది. అదేవిధంగా కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, మహారాష్ట్రకు ముంబై ఆర్థిక కేంద్రాలుగా ఉన్నాయి. ఆ నగరాల నుంచి వచ్చే ఆదాయాన్ని మిగతా జిల్లాల అభివృద్ధికి పంచుతున్నారు. అదే దూరదృష్టితో చంద్రబాబు అమరావతిని నిర్మిస్తున్నారు" అని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి నిర్మించడం ద్వారా పర్యాటకం, హోటల్ రంగం అభివృద్ధి చెంది, వేలాది మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు.

2028 ఆగస్టు డెడ్‌లైన్ 
ముఖ్యమంత్రి చంద్రబాబు తన అపార అనుభవంతో రూపొందించిన ప్రణాళిక ప్రకారం పనులు వేగంగా జరుగుతాయని, 2028 ఆగస్టు నాటికి అమరావతిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. కొన్ని భవనాలు ఇప్పటికే పూర్తయ్యాయని, దశలవారీగా మిగతా పనులు కూడా పూర్తవుతాయని చెప్పారు. తాము ప్రజల కోసం రాజధాని కడుతుంటే, జగన్ మాత్రం తన బొమ్మను సర్వే రాళ్లపై వేసుకోవడానికి రూ.750 కోట్లు, హైదరాబాద్, వైజాగ్‌లలో ప్రజాధనంతో ప్యాలెస్‌లు కట్టుకున్నారని తీవ్రంగా ఆరోపించారు.

గత ఐదేళ్లలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులను జగన్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను మంత్రి గుర్తుచేశారు. మహిళలని కూడా చూడకుండా బూటుకాళ్లతో తన్నారని, లాఠీఛార్జీలు చేసి, ఫెన్సింగ్ వేసి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల త్యాగాలకు, పోరాటానికి ఈరోజు చట్టసవరణతో న్యాయం జరిగిందని, ఇక రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
Ponguru Narayana
Amaravati
Andhra Pradesh
YS Jagan Mohan Reddy
Capital City
Land Pooling
AP Reorganisation Act
Economic Growth
Chandrababu Naidu
AP Politics

More Telugu News