Arjun Tendulkar: సచిన్ కాకుండా నా ఫేవరెట్ అతడే.. సీక్రెట్ చెప్పిన అర్జున్ టెండూల్కర్

Arjun Tendulkar Reveals Favorite Player Besides Sachin Tendulkar
షార్ట్స్‌లో చూడండి
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, ఆల్-రౌండర్ అర్జున్ టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ (MI) నుంచి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు మారిన అర్జున్, ఇటీవలే ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన స్నేహితులు, అలవాట్లు, విమర్శలపై స్పందించాడు. తన స్నేహితుల్లో దాదాపుగా ఎవరూ క్రికెటర్లు లేరని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇటీవల శుభంకర్ మిశ్రా నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో అర్జున్ పాల్గొన్నాడు. "మీరు ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటారు?" అని అడిగిన ప్రశ్నకు, "గోవాలోని నా ఇంట్లో ఐదు పెంపుడు కుక్కలు ఉన్నాయి. వాటితో ఆడుకుంటూ సమయం గడుపుతాను. అదే నా ప్రశాంతతకు కారణం" అని అర్జున్ బదులిచ్చాడు. 

"మీకు క్రికెటర్ స్నేహితులు ఉన్నారా?" అని అడగ్గా, "నాకు నిజంగా క్రికెటర్ స్నేహితులు లేరు. నా స్నేహితుల్లో చాలా మందికి క్రికెట్‌తో పెద్దగా పరిచయం కూడా లేదు. అందుకే నేను వారితో క్రికెట్ గురించి మాట్లాడను" అని వివరించాడు.

సచిన్ కుమారుడు కావడంతో అర్జున్‌పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కారణంగా అతను సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్‌కు, విమర్శలకు గురవుతుంటాడు. "విమర్శలంటే మీకు భయమా?" అని అడగ్గా, "లేదు, నాకు భయం లేదు" అని అర్జున్ ధీమాగా సమాధానమిచ్చాడు.

కెరీర్ పరంగా ముంబై ఇండియన్స్‌లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి ప్రపంచ స్థాయి పేసర్లు ఉండటంతో అర్జున్‌కు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇప్పుడు లక్నో జట్టుకు మారినప్పటికీ, అక్కడ కూడా మహ్మద్ షమీ, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, అన్రిచ్ నోర్ట్జే వంటి నాణ్యమైన పేసర్లతో పోటీ పడాల్సి ఉంటుంది. అయితే, బౌలర్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా రాణించగల సత్తా అర్జున్‌కు ఉంది. ఈ సామర్థ్యమే లక్నో జట్టులో లోయర్-మిడిల్ ఆర్డర్‌లో అతనికి చోటు కల్పించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదే ఇంటర్వ్యూలో తన తండ్రి స‌చిన్ టెండూల్క‌ర్‌ కాకుండా మీరు ఆరాధించే ఆటగాడు ఎవరని అడగ్గా, యువరాజ్ సింగ్ పేరు చెప్పాడు. "యువరాజ్ బౌలింగ్ అంటే ఇష్టమా?" అని ప్రశ్నించగా, "అతను స్పిన్నర్, నేను పేసర్‌ను" అని చమత్కరించాడు.
Go Back to Shorts
Arjun Tendulkar
Sachin Tendulkar
Yuvraj Singh
Mumbai Indians
Lucknow Super Giants
IPL 2026
Cricket
Indian Premier League
Cricket Friends
Arjun Tendulkar Interview

More Telugu News