Cooper Connolly: కూపర్ కనోలీ సూపర్ షో.. గుజరాత్‌పై పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. 163 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలినా, యువ ఆటగాడు కూపర్ కనోలీ (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కీలక సమయంలో జేవియర్ బార్ట్‌లెట్ (5 బంతుల్లో 11 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌ను కట్టడి చేసింది. శుభ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38) రాణించడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశ్యాఖ్ 3 వికెట్లతో సత్తా చాటగా, యజువేంద్ర చాహల్ 2 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌కు ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 37; 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే అతను ఔటయ్యాక పంజాబ్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (18) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో పాతుకుపోయిన కూపర్ కనోలీ, గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా సంయమనంతో ఆడుతూనే, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.

ఆఖరి ఓవర్లలో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. చివర్లో మార్కో యాన్సెన్ (9) ఔటవ్వడంతో పంజాబ్ శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే కనోలీకి జత కలిసిన బార్ట్‌లెట్ ఒక సిక్సర్ బాది సమీకరణాన్ని సులభతరం చేశాడు. దీంతో పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఈ సీజన్‌లో తమ తొలి విజయాన్ని ఘనంగా నమోదు చేసింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. కనోలీ అసాధారణ పోరాట పటిమతో పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.


Cooper Connolly
Punjab Kings
Gujarat Titans
IPL 2026
Indian Premier League
T20 Cricket
Cricket Match
Shubman Gill
Vijaykumar Vyshak
Prabhsimran Singh

More Telugu News