India Evacuation: పశ్చిమాసియా సంక్షోభం.. 5.72 లక్షల మంది భారతీయులు స్వదేశానికి!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 5.72 లక్షల మంది ప్రయాణికులు పశ్చిమాసియా దేశాల నుంచి సురక్షితంగా భారత్‌కు తిరిగి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఇవాళ‌ వెల్లడించింది. ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో నేడు సుమారు 8 నుంచి 10 ప్రత్యేక వాణిజ్య విమానాలు భారత్‌కు రానున్నాయని తెలిపింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. యూఏఈ నుంచి రోజుకు సుమారు 85 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఒమన్, సౌదీ అరేబియా నుంచి కూడా భారత్‌కు విమానాలు నడుస్తున్నాయి. అయితే, కువైట్, బహ్రెయిన్ గగనతలాలు ఇంకా మూసివేసే ఉండటంతో ఆ మార్గాల్లో సర్వీసులు నిలిచిపోయాయి. సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి మాత్రం భారత్‌లోని వివిధ నగరాలకు ప్రత్యేక విమానాలు నడుస్తున్నాయి.

పలు దేశాల్లో గగనతలాలు మూసివేయడంతో భారతీయుల ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను సులభతరం చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇరాన్ గగనతలం మూసివేత కారణంగా ప్రయాణికులను ఆర్మేనియా, అజర్‌బైజాన్ మీదుగా తరలిస్తున్నారు. అలాగే, ఇజ్రాయెల్‌లో ఆంక్షల దృష్ట్యా ఈజిప్ట్, జోర్డాన్ ద్వారా.. ఇరాక్ గగనతలం మూసివేతతో జోర్డాన్, సౌదీ అరేబియా ద్వారా భారతీయుల ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి భారతీయ సమాజంతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారి భద్రతకు అవసరమైన సహాయం, సూచనలు అందిస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది.

మరోవైపు సముద్ర జలాల్లోని భారత నావికులందరూ సురక్షితంగా ఉన్నారని పోర్ట్స్, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గత 24 గంటల్లో భారత పతాక నౌకలపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 18 భారత నౌకల్లో 485 మంది సిబ్బంది ఉన్నారని, వీరిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) నిశితంగా పర్యవేక్షిస్తోందని పేర్కొంది. కాగా, ఇప్పటివరకు 959 మంది భారత నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించగా, గత 24 గంటల్లో 9 మంది తిరిగి వచ్చారు. భారత్‌లోని అన్ని ప్రధాన పోర్టుల కార్యకలాపాలు సాధారణంగా, ఎటువంటి రద్దీ లేకుండా కొనసాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
India Evacuation
West Asia Crisis
Indian Nationals
MEA
Air India
Middle East Conflict
Dammam Airport
Operation Ajay
Indian Navy
Persian Gulf

More Telugu News