Bihar Temple Stampede: బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది భక్తులు మృతి

బీహార్‌లోని నలంద జిల్లాలో మంగళవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మగ్రా గ్రామంలోని ప్రసిద్ధ శీతలా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో డజను మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో భయాందోళన వాతావరణం నెలకొంది. భక్తులు పరుగులు తీయడంతో పలువురు మహిళలు కిందపడిపోయారు. వారిపై నుంచే ఇతరులు వెళ్లడంతో ఊపిరాడక 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ దుర్ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మంగళవారం ఆలయం వద్ద రద్దీ ఉంటుందని తెలిసినా, యంత్రాంగం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తున్నారు. ప్రమాద సమయంలో తగినంత మంది పోలీసులు లేరని, అంబులెన్స్‌లు కూడా ఆలస్యంగా చేరుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ప్రమాదంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Bihar Temple Stampede
Bihar
Nalanda District
Sheetala Devi Temple
Temple Stampede
India News
Samrat Choudhary
Bihar Government
Chaitra Month
Hindu Temple

More Telugu News