Botsa Satyanarayana: మూలపేట పోర్టుపై క్రెడిట్ వార్.. అమరావతిపై వైసీపీ నేతల ఫైర్

శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు క్రెడిట్ వ్యవహారం రాజకీయంగా వేడి పుట్టించింది.  మాజీ ఉపముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజినల్ కో -ఆర్డినేటర్ బూడి ముత్యాల నాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కురసాల కన్నబాబు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే,  పోర్టును సందర్శించేందుకు వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు సంతబొమ్మాళి మండలం నౌపడ వద్ద సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు.. కూటమి ప్రభుత్వంపై, రాజధాని అమరావతిపై తీవ్ర విమర్శలు చేశారు. మూలపేట పోర్టు నిర్మాణం 75 శాతం జగన్ హయాంలోనే పూర్తయిందని, ఆ ఘనత పూర్తిగా ఆయనకే చెందుతుందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ క్రెడిట్‌ను కొట్టేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. జగన్ చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడానికి సిగ్గులేకుండా క్రెడిట్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సభలో రాజధాని అమరావతి అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ ఇటీవల అసెంబ్లీలో చేసిన తీర్మానానికి ఎలాంటి విలువ లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. సంపద అంతా అమరావతిలోనే పెడితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.
Botsa Satyanarayana
Mulapeta Port
Andhra Pradesh
YSRCP
Amaravati
Dharmana Prasada Rao
Ram Mohan Naidu
Srikakulam
Jagan Mohan Reddy

More Telugu News