Vodafone Idea: 5జీ సేవలు మరిన్ని నగరాలకు విస్తరించిన వొడాఫోన్ ఐడియా

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వి) తమ 5జీ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించనున్నట్లు ప్రకటించింది. మే 2026 నాటికి దేశవ్యాప్తంగా మరో 90 నగరాలకు 5జీ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ విస్తరణతో కంపెనీ 5జీ సేవలు అందించే నగరాల సంఖ్య 43 నుంచి 133కి పెరగనుంది.

ఎక్కువ 5జీ డివైజ్‌లు ఉన్న ప్రాంతాలు, అధిక డేటా వినియోగం ఉన్న పట్టణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ విస్తరణ చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు చెన్నై, కోయంబత్తూర్, గోవా, పుదుచ్చేరి, వారణాసి, ప్రయాగ్‌రాజ్ వంటి పలు కీలక నగరాలు ఉన్నాయి. ఈ విస్తరణ కోసం ఎరిక్సన్, నోకియా, శాంసంగ్ వంటి గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ విస్తరణపై వొడాఫోన్ ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ) జగ్బీర్ సింగ్ మాట్లాడుతూ.. '5జీ డివైజ్‌ల వాడకం ఎక్కువగా ఉన్న కీలక మార్కెట్లలో సేవలను విస్తరించాలన్న మా వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ దశ విస్తరణతో ప్రధాన నగరాల్లో మా 5జీ నెట్‌వర్క్‌ను గణనీయంగా పెంచుతున్నాం' అని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు, డిజిటల్ ప్రపంచంలో వారు రాణించేందుకు వీలుగా ఒక పటిష్టమైన నెట్‌వర్క్‌ను నిర్మించడానికి కట్టుబడి ఉన్నామని ఆయన వివరించారు.
 
 
Vodafone Idea
VI 5G
Vodafone Idea 5G expansion
5G India
Jagbir Singh
Ericsson
Nokia
Samsung
Tirupati
Hyderabad

More Telugu News