Bhuma Akhila Priya: అతి మంచితనం పనికిరాదని తెలుసుకున్నాం: భూమా అఖిలప్రియ

నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరోసారి వార్తల్లో నిలిచారు. చింతకుంట హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడి, జైలులో ఉన్న 12 మంది దోషులను ఆమె నిన్న పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. "రేపటి నుండి మా రాజకీయాల్లో మార్పులు చూడబోతారు" అంటూ ఆమె ప్రత్యర్థులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.


రాజకీయ ప్రస్థానంలో తానూ, తన కుటుంబం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని అఖిలప్రియ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. "అతి మంచితనం మంచిది కాదని ఈ మధ్యే తెలుసుకున్నాం. రాజకీయాల్లో ఎంతో నష్టపోయాం, కేసులు వేయించుకున్నాం, జైలుకు కూడా వెళ్లాం. చట్టంపై మాకు గౌరవం ఉంది. కానీ పరిస్థితులను బట్టి మా పంథా మార్చుకోక తప్పదు" అని ఆమె స్పష్టం చేశారు.


కోర్టు వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని చెబుతూనే, శిక్ష పడిన వారి పట్ల ఆమె సానుభూతి వ్యక్తం చేశారు. శిక్ష పడిన 12 మంది కుటుంబాలకు అండగా ఉంటామని, వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేస్తామని భరోసానిచ్చారు. హైకోర్టులో తమ వాదనలను బలంగా వినిపించి న్యాయ పోరాటం చేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లడానికైనా వెనుకాడబోనని ప్రకటించారు.

Bhuma Akhila Priya
Allagadda
Nandyala district
Chintakunta murder case
TDP MLA
Andhra Pradesh politics
Political challenges
Jail
Court
Political strategy

More Telugu News