Perni Nani: కొల్లు రవీంద్ర ఏజెంట్లకు రెవెన్యూ యంత్రాంగం తొత్తుగా మారింది: పేర్ని నాని
బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలో సన్నకారు రైతులను కూటమి ప్రభుత్వం దోచుకుంటోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్‌ను కలిసిన ఆయన... ఆర్డీవో, ఎమ్మార్వోలపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర ఏజెంట్లకు రెవెన్యూ యంత్రాంగం తొత్తుగా మారిందని నాని ఆరోపించారు. "వందల ఎకరాలు ఉన్న బడా రైతులకు రెడ్ కార్పెట్ పరుస్తున్న అధికారులు... ఎకరం, అర ఎకరం ఉన్న చిన్న రైతులను మాత్రం పట్టిపీడిస్తున్నారు. చెరువు రిపేరు చేయాలన్నా రూ. 50 వేలు, బోరు వేయాలన్నా మరో రూ. 50 వేలు వసూలు చేస్తూ వికృత సంస్కృతికి తెరలేపారు" అని ధ్వజమెత్తారు.
పెదపట్నం, కానూరు గ్రామాల్లో మడ అడవులను యథేచ్ఛగా నరికి చెరువులు తవ్వుతుంటే పట్టించుకోని అధికారులు, కోన గ్రామంలోని ఓ చిన్న రైతును రికార్డుల పేరుతో వేధించడం దారుణమన్నారు. 83 సెంట్ల భూమి ఉన్న రైతును ఆర్డీవో సాంబశివరావు నానా హైరానా పెట్టి, చెరువును పూడ్చాలని ఆదేశించడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు. ముడుపుల మాయలో పడి చిన్న రైతుల పొట్ట కొట్టాలని చూస్తే సహించేది లేదని, బాధితుల పక్షాన పోరాడతామని పేర్ని నాని హెచ్చరించారు.