Stock Market: ఆర్థిక సంవత్సరం చివరి రోజున... కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ఈ ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజున భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనలు దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ పరిణామాలతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలాయి.

సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు నష్టపోయి 71,947.55 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, నిఫ్టీ 488.20 పాయింట్లు పతనమై 22,331.40 వద్ద ముగిసింది. టెక్నికల్‌గా చూస్తే, నిఫ్టీ కీలకమైన 22,500 మద్దతు స్థాయిని కోల్పోవడం మార్కెట్‌లో మరింత బలహీనతకు సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. 22,500-22,600 స్థాయి నిఫ్టీకి తక్షణ నిరోధకంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ షేర్లు నిఫ్టీలో టాప్ లూజర్లుగా నిలిచాయి. సెన్సెక్స్ ప్యాక్‌లో టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ మాత్రమే లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి షేర్లు భారీగా నష్టపోయాయి.

లార్జ్‌క్యాప్ షేర్లతో పాటు బ్రాడర్ మార్కెట్లు కూడా పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.68 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.66 శాతం చొప్పున నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు అత్యధికంగా నష్టపోయాయి. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ దాడులు విస్తరించడం, ఘర్షణల్లోకి హౌతీలు ప్రవేశించడం, అమెరికా బలగాల మోహరింపు వంటి పరిణామాలు ద్రవ్యోల్బణంపై ఆందోళనలను పెంచాయని, దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లారని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Stock Market
Sensex
Nifty
Share Market
Indian Stock Market
Market Crash
Financial News
Bajaj Finance
SBI
Share prices

More Telugu News