Gutta Sukhender Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు వేసిన మండలి చైర్మన్

తెలంగాణ శాసనమండలిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ నుంచి సస్పెండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా ప్రతిపక్షం చేపట్టిన నిరసన చివరకు సభ్యుల బహిష్కరణకు దారితీసింది.


సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు మంత్రి పొంగులేటి వ్యవహారంపై చర్చకు పట్టుబట్టారు. చైర్మన్ అనుమతించకపోవడంతో సభ్యులందరూ ఒక్కసారిగా పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై మండలి చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు సీట్లలోకి వెళ్లాలని పదే పదే విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది.


పోడియం వద్ద ఆందోళన చేస్తున్న సభ్యులను అడ్డుకునేందుకు మార్షల్స్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మార్షల్స్ - బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటుచేసుకుంది. సభ్యుల ప్రవర్తన సభా నియమావళికి విరుద్ధమని భావించిన చైర్మన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అందరినీ ఒకరోజు పాటు సభ నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


సస్పెన్షన్ వేటుకు గురైన వారిలో మధుసూదనాచారి, రవీందర్‌రావు, దేశపతి శ్రీనివాస్‌, ఎల్‌. రమణ, యాదవరెడ్డి, సుంకరి రాజు, నవీన్‌కుమార్‌రెడ్డి, మధుసూదన్‌, వాణీదేవి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎం.కోటిరెడ్డి ఉన్నారు. సస్పెన్షన్ అనంతరం బయటకు వచ్చిన సభ్యులు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. మంత్రిపై వస్తున్న తీవ్రమైన ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ సస్పెన్షన్ డ్రామా ఆడారని ఆరోపించారు. తాము సస్పెన్షన్లకు భయపడబోమని, ప్రజా క్షేత్రంలో మంత్రి అక్రమాలను ఎండగడతామని స్పష్టం చేశారు.

Gutta Sukhender Reddy
Telangana Legislative Council
BRS MLCs suspended
Ponguleti Srinivas Reddy
Telangana Assembly
MLC suspension
Telangana politics
Council Chairman
BRS protest
Telangana government

More Telugu News