Vijayasai Reddy: ఈ ఎమోషనల్‌ డైలాగుల వల్ల అమరావతి రైతులకు న్యాయం జరగదు: విజయసాయిరెడ్డి

రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు గతంలో ఇస్తామన్న నివాస, వాణిజ్య ప్లాట్లతో పాటు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం అదనంగా నష్టపరిహారం కూడా చెల్లించాలని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

"ఒక రైతుగా అడుగుతున్నా. నా అమరావతి రైతు సోదరుల కోసం అధికారపార్టీని అడుగుతున్నా. 2015లో ల్యాండ్‌ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రైతుల్లో ఎవరైనా వారికి కేటాయించిన ప్లాట్‌లో ఇల్లు కట్టుకోగలిగారా? వారిలో ఏ ఒక్క రైతు అయినా వారికి ఇచ్చిన కమర్షియల్‌ స్థలంలో ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టగలిగారా? ఈ 11 ఏళ్ళ కాలంలో వారికి కేవలం ఏడాదికి ఇంత అని నామమాత్రంగా డబ్బు ఇవ్వటం వల్ల కలిగిన లాభం ఏమిటి? 

రైతుల త్యాగాలు వెల కట్టలేనివి అని నిన్న శాసన సభలో పలువురు సభ్యులు చెప్పారు. ఈ ఎమోషనల్‌ డైలాగుల వల్ల రైతులకు న్యాయం జరగదు. భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికి అయినా ఇంతకు ముందు మీరు ఇస్తాం అన్న ఇళ్ల స్థలం, కమర్షియల్‌ స్థలం మాత్రమే కాకుండా, అదనంగా ఫెయిర్ కాంపిన్సేషన్ చట్టం 2013 ప్రకారం నష్ట పరిహారం ఇవ్వండి. అసైన్డ్‌ భూముల విషయంలో ఒరిజినల్‌ హక్కుదారులకే నష్ట పరిహారం ఇవ్వండి. 

అలాగే మరో విషయాన్ని కూడా అడుగుతున్నా, నిరుపేదలకు గత ప్రభుత్వం కేటాయించిన 50 వేల ఇళ్ల పట్టాలను మీరెందుకు రద్దు చేశారు? ఆ ప్లాట్లను ఆ నిరుపేదలకే తిరిగి ఇవ్వండి. ఒక వైపు లక్షల కోట్లతో రాజధాని కడతాం అంటున్నారు. మీరు కట్టండి కానీ, ఆ భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయనట్టయితే, ఆ నిర్మించే భారీ భవనాల పునాదులు ఎవరి భూముల్లో నిర్మిస్తున్నారో వారికే సంతృప్తి, సంతోషం కలిగించనట్టయితే ఏమిటి ప్రయోజనం? అలా నిర్మించే రాజధాని వల్ల ఏ ధనికులకి, బూర్జువాలకి లాభం కలుగుతుందో ప్రజలు కూడా ఆలోచన చేస్తారని మీరు కూడా గమనించండి" అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.


Vijayasai Reddy
Amaravati farmers
Andhra Pradesh
land pooling
compensation
housing plots
commercial plots
fair compensation act 2013
land acquisition
AP government

More Telugu News