Narendra Modi: నోయిడా వెళితే ప్రధాని పదవి పోతుందని నాతో చెప్పారు: నరేంద్ర మోదీ

సమాజ్‌వాది పార్టీ నేతలు మూఢనమ్మకాలు, పిరికితనంతో నోయిడాను గాలికి వదిలేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. గతంలో ఉత్తర‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్నవారు తమ పదవులను కోల్పోతామనే భయంతో నోయిడాకు రావడమే మానేశారని ఆరోపించారు. సమాజ్‌వాది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాను ఇక్కడకు రావాలని అనుకున్నానని, ఈ నిర్ణయంతో నాటి ముఖ్యమంత్రి ఆందోళనకు గురయ్యారని అన్నారు.

"మోదీ గారూ, నోయిడాకు వెళ్లవద్దు, మీరు ఈ మధ్యనే ప్రధాని అయ్యారు" అని ఆయన తనను హెచ్చరించారని చెప్పారు. నోయిడాకు ఆయన రాకపోగా, తనను కూడా రావొద్దని సూచించారని తెలిపారు. తాను మాత్రం కచ్చితంగా వెళతానని ఆ ముఖ్యమంత్రికి స్పష్టంగా చెప్పానని తెలిపారు.

నోయిడా ప్రజల ఆశీర్వాదం కోసం వెళతానని, అది సుదీర్ఘకాలం దేశానికి సేవ చేసే అవకాశాన్ని ఇస్తుందని భావిస్తున్నానని ఆయనతో చెప్పినట్లు వెల్లడించారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు ఈ నగరాన్ని వదిలేశారని, కానీ ఇప్పుడు ప్రపంచస్థాయి నేతలను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఈ నగరం ఈరోజు దేశానికి గర్వకారణంగా నిలిచిందని వ్యాఖ్యానించారు.

అధికారంలో ఉన్నవారు నోయిడాలో పర్యటిస్తే వారికి అపశకునంగా మారుతుందనే నమ్మకం చాలాకాలంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పై వ్యాఖ్యలు చేశారు. 1988 నుంచి ఈ నగరంలో పర్యటించిన పలువురు ముఖ్యమంత్రులు ఆ తర్వాత వివిధ కారణాలతో పదవులకు దూరమయ్యారు. దీనితో నోయిడాకు వెళ్లడానికి రాజకీయ ప్రముఖులు ఆసక్తి కనబరచరు. అయితే యోగి ఆదిత్యనాథ్ తాను ముఖ్యమంత్రి అయ్యాక పలుమార్లు నోయిడాలో పర్యటించారు.
Narendra Modi
Noida
Samajwadi Party
Uttar Pradesh
Yogi Adityanath
Chief Minister
Superstition

More Telugu News