ఉద్యోగాల కేంద్రంగా జేవార్ ఎయిర్పోర్ట్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- కార్యక్రమానికి హాజరైన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
- ఈ ఎయిర్పోర్ట్ దేశానికే గర్వకారణమని చెప్పిన మంత్రి
- విమానయాన రంగంలో యువతకు భారీ అవకాశాలు లభిస్తాయని విశ్వాసం
- స్థానిక ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు సులభంగా చేరుకుంటాయని వెల్లడి
తొలి దశలో దాదాపు రూ.11,200 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసినట్టు తెలిపారు. అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించగల సామర్థ్యంతో నాలుగు కిలోమీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించినట్టు వివరించారు. ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా, అభివృద్ధికి వారసత్వాన్ని జోడిస్తూ ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక గుర్తింపును ఈ ఎయిర్పోర్ట్ టర్మినల్ ప్రతిబింబిస్తుందని చెప్పారు.
ఈ ప్రాజెక్టును కార్గో మౌలిక వసతులతో కూడిన సమీకృత 'ఏరోట్రోపోలిస్'గా తీర్చిదిద్దుతున్నామని, దీనివల్ల స్థానికంగా తయారైన వస్తువులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సులభంగా చేరుకుంటాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. 40 ఎకరాల్లో ఏర్పాటు కానున్న మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ కేంద్రం స్థానిక యువతకు విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.
"గతంలో జేవార్, సమీప ప్రాంతాల ప్రజలు ఉద్యోగాల కోసం ఢిల్లీ వెళ్లేవారు. ఇప్పుడు దేశ విదేశాల నుంచి ప్రజలు ఉద్యోగాల కోసం జేవార్‌కు వస్తారు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్ వంటి అనేక రంగాల్లో అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 'ఉడాన్' వంటి పథకాలతో సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని, ఈ వృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.