Revanth Reddy: మూసీ తీరంలో ఆధ్యాత్మిక శోభ.. రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ శివార్లలోని గండిపేట మండలం మంచిరేవుల వద్ద రూ.700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ‌ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూసీ తీరాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మార్చే లక్ష్యంలో భాగంగా 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు.

శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనల మేరకు ఈ ఆలయ డిజైన్‌ను ఖరారు చేశారు. ఆలయ ప్రవేశంలో 100 అడుగుల ఎత్తైన రాజగోపురం, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక మండపాలు నిర్మిస్తారు. 207 అడుగుల పొడవైన మహామండపం, దానిని ఆనుకుని ఓంకారేశ్వర మందిరం కొలువుదీరనుంది. యాదగిరిగుట్ట తర్వాత రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద గర్భాలయంగా ఇది నిలవనుంది. రామప్ప, యాదగిరిగుట్ట నిర్మాణాల్లో వాడిన నాణ్యమైన కృష్ణశిలతోనే ఈ ఆలయాన్ని కూడా నిర్మించనుండటం విశేషం.

ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది మధ్యలో 100 అడుగుల భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నదిపై చెక్‌డ్యామ్ నిర్మించి బోటింగ్ వంటి పర్యాటక సౌకర్యాలను కల్పించనున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 2,000 వాహనాలకు సరిపడా పార్కింగ్ వసతి, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నేరుగా కనెక్టివిటీ కల్పిస్తారు. సమీపంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం ఉన్న గుట్టపైకి వెళ్లేందుకు అత్యాధునిక తీగల వంతెనను నిర్మించనున్నారు.

ఈ ప్రాంతంలో ఇప్పటికే 1400 ఏళ్ల నాటి చాళుక్యుల కాలం నాటి మచిలేశ్వర ఆలయం, 800 ఏళ్ల నాటి కాకతీయుల వీరభద్రస్వామి ఆలయం ఉన్నాయి. చేప ఆకారంలో శివలింగం ఉండటంతో ఈ ఆలయానికి మచిలేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇప్పుడు నిర్మించబోయే అధునాతన ఓంకారేశ్వర ఆలయంతో ఈ ప్రాంతం ప్రాచీన, ఆధునికతల సంగమంగా మారి 'చిన్న శ్రీశైలం'గా ప్రసిద్ధి చెందుతుందని ప్రభుత్వం, భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Revanth Reddy
Omkareshwara Temple
Musi River
Telangana
Temple construction
Gandipet
Mucherla
Tourism
Spiritual tourism
Hyderabad

More Telugu News