Telangana: తెలంగాణలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్.. వారానికి ఐదు రకాల టిఫిన్లు.. మెనూ ఇదే!

Revanth Reddy Announces CM Breakfast Scheme for Telangana Schools
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న 'ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్' పథకానికి సంబంధించిన మెనూను విద్యాశాఖ ఖరారు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద విద్యార్థులకు వారానికి ఆరు రోజుల పాటు వేడివేడిగా, రుచికరమైన అల్పాహారం అందించనున్నారు.

వారానికి ఐదు రకాల టిఫిన్లు
విద్యాశాఖ విడుదల చేసిన మెనూ ప్రకారం.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాలతో కూడిన టిఫిన్లను అందిస్తారు. సోమవారం దోసె-చట్నీ లేదా చపాతీ-కూర, మంగళవారం రెండు మిల్లెట్ ఇడ్లీలు-సాంబారు, బుధవారం రెండు పూరీలు-ఆలూ కుర్మా, గురువారం మళ్లీ రెండు మిల్లెట్ ఇడ్లీలు-సాంబారు అందిస్తారు. ఇక శుక్రవారం మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్-చట్నీ, శనివారం రెండు బోండాలు-చట్నీని మెనూలో చేర్చారు. టిఫిన్‌తో పాటు రోజూ విడిచి రోజు పాలు, రాగిజావను (వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావ) విద్యార్థులకు ఇవ్వనున్నారు.

22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
ఈ పథకం ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రభుత్వ విద్యార్థులందరికీ వర్తిస్తుంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. విద్యార్థులు ప్రశాంతంగా టిఫిన్ తినేందుకు వీలుగా రోజూ 45 నిమిషాల సమయం కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. పాఠశాల విద్యార్థుల టిఫిన్ కోసం రూ. 540 కోట్లు, పాల కోసం రూ. 180 కోట్లు, ఇంటర్ విద్యార్థుల కోసం అదనంగా రూ. 56 కోట్లు కేటాయించారు.

తమిళనాడులో విజయవంతంగా అమలవుతున్న బ్రేక్‌ఫాస్ట్ పథకం తరహాలోనే తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇటీవలే చెన్నై పర్యటనలో ఈ విషయాన్ని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ హామీకి అనుగుణంగానే ఇప్పుడు అధికారులు మెనూ, విధివిధానాలను ఖరారు చేసి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు సిద్ధమవుతున్నారు.
Go Back to Shorts
Telangana
Revanth Reddy
CM Breakfast Scheme
Telangana Breakfast Program
School Breakfast
Government Schools
Student Nutrition
Midday Meals
Education
Telangana Education

More Telugu News