Ranganath: పాటిఘనాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. పార్కులు, రోడ్లకు విముక్తి

Ranganath HMDA Ends 46 Year Land Dispute in Patancheru
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పాత లే ఔట్లలో కబ్జాలకు గురైన ప్రజా ప్రయోజన స్థలాలపై హైడ్రా దృష్టి సారించింది. ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. తాజాగా సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం పాటిఘనాపూర్‌లో భారీ ఆపరేషన్ నిర్వహించి, సుమారు 47,840 గజాల పార్కులు, రహదారుల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.

48 గంటల్లోనే చర్యలు

1980లో పాటిఘనాపూర్‌లో 92 ఎకరాల్లో 1109 ప్లాట్లతో ఆనంద నగర్ కాలనీ లే ఔట్ వేశారు. అయితే, కబ్జాదారులు ఈ లే ఔట్‌ను వ్యవసాయ భూమిగా చిత్రీకరించి, నకిలీ పాస్‌బుక్‌లతో ఇతరులకు అమ్మకాలు జరుపుతున్నారని సోమవారం ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీనిపై వెంటనే స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, బుధవారం క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించారు. లే ఔట్‌లోని పార్కులు, రహదారుల స్థలాలు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించుకుని, గురువారం ఉదయం భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆక్రమణదారులు నిర్మించిన ప్రహరీలు, షెడ్లను తొలగించి, పార్కు స్థలాల్లో హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు. రోడ్లకు హద్దులు నిర్ణయించి, పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేశారు.

పలు లే ఔట్లలో క్షేత్రస్థాయి పరిశీలన

పాటిఘనాపూర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని పలు లే ఔట్లను కూడా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని శంకర హిల్స్ లే ఔట్, అమీన్‌పూర్ మండలం బీరంగూడలోని ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ లే ఔట్‌లలోని సమస్యలను పరిశీలించారు. శంకర హిల్స్ లే ఔట్‌లో యాజమాన్య హక్కులపై వివాదాలున్నట్లు, బీరంగూడ లే ఔట్‌లో కబ్జాదారులు అక్రమంగా 100 గజాల ప్లాట్లు అమ్ముతున్నట్లు బాధితులు కమిషనర్‌కు వివరించారు. అందరి వాదనలు విన్న ఆయన, సంబంధిత పత్రాలతో పూర్తి నివేదిక సమర్పించాలని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

లే ఔట్లలో పార్కులు, రోడ్లు, ప్రజావసరాల స్థలాలను కచ్చితంగా పరిరక్షిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఇళ్లు కొనుగోలు చేసిన లేదా నిర్మించుకున్న అసలైన యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బీరంగూడలోని శంభునికుంట వరద కాలువను పూడ్చి అక్రమ నిర్మాణాలు చేపట్టిన సంస్థపై కేసులు నమోదు చేసి, కాలువను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలోని ప్రభుత్వ భూముల కబ్జాపై వచ్చిన ఫిర్యాదులపైనా విచారణ జరిపి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
Go Back to Shorts
Ranganath
Patancheru
Land Grabbing
HMDA
Telangana
Sangareddy District
Dharani Portal
Illegal Constructions
Enforcement
Land Dispute

More Telugu News