Telangana: సర్కారీ బడుల్లో ఇక చేపల కూర.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Revanth Reddy Government to Serve Fish Curry in Telangana Schools
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక తీపి కబురు అందించింది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తుండగా, ఇకపై ఆ మెనూలో చేపల కూరను కూడా చేర్చనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో వెల్లడించారు.

సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "మధ్యాహ్న భోజన పథకంలో చేపల కూరను అందిస్తాం. ఈ అంశంపై ఇప్పటికే కేబినెట్‌లో చర్చించాం" అని ఆయన వివరించారు.

పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారి కోసం ప్రత్యేకంగా 'తిలాపియా' అనే జాతి చేపలను పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. "ఈ చేపకు మధ్యలో ఒక్కటే వెన్నుముల్లు ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా తినవచ్చు. వీటిని ప్రత్యేకంగా పెంచి విద్యార్థులకు అందిస్తాం" అని శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రంలో బలమైన పశుసంపద ఉందని, గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఆయన గుర్తుచేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడంతో పాటు, గ్రామస్థాయిలో క్రీడలను బలోపేతం చేసేందుకు కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని మంత్రి తెలిపారు. 
Go Back to Shorts
Telangana
Revanth Reddy
Telangana government
Government schools
Midday meal scheme
Fish curry
Tilapia fish
Nutrition
Education
Wakiti Srihari
Assembly

More Telugu News