Ameesha Patel: 'ధురంధర్ 2'ను ప్రశంసిస్తూ.. బాలీవుడ్‌పై అమీషా పటేల్ తీవ్ర విమర్శలు!
బాలీవుడ్ నటి అమీషా పటేల్ తాజాగా ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'ధురంధర్ 2' సినిమాపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్న ఈ చిత్రాన్ని చూసిన అమీషా పటేల్... బాలీవుడ్‌కు ఈ చిత్రం ఒక కనువిప్పు అని అన్నారు.
తన ఎక్స్ ఖాతాలో అమీషా స్పందిస్తూ, "'ధురంధర్' చిత్రాన్ని పరిశ్రమ మొత్తం మెచ్చుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ బ్రాండ్ అన్ని ప్రశంసలకు అర్హమైనది. ఆదిత్య ఒక 'ప్రాజెక్ట్'ను కాదు, ఒక 'సినిమా'ను తీశారని ఇండస్ట్రీ గ్రహించాలి. పార్టీలలో ట్రెండ్ అయ్యే ఇన్‌స్టాగ్రామర్లను కాకుండా, ప్రతిభ గల నటులను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులు చేయడం ఆపి, సినిమాలు చేయడం మొదలుపెట్టండి" అంటూ బాలీవుడ్‌కు చురకలు అంటించారు.
మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే భారత్‌లో సుమారు రూ. 500 - 600 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 900 కోట్ల మార్కును దాటి, 2026లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రణవీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు ఈ స్పై థ్రిల్లర్‌లో నటించారు. అమీషా పటేల్‌తో పాటు సూపర్‌స్టార్ రజనీకాంత్, అల్లు అర్జున్, మహేశ్ బాబు వంటి ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.