ఆ యాక్సిడెంట్ నా జీవితాన్ని తలకిందులు చేసింది: 'ఆషికీ' ఫేమ్ అను అగర్వాల్

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఆషికీ’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన నటి అను అగర్వాల్. మోడల్ గానూ ఎంతో గుర్తింపు పొందారు. 1999లో తన జీవితాన్ని మార్చేసిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి తాజాగా ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఆ ప్రమాదం తన ముఖంపై, ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపిందో, సుదీర్ఘకాలం పాటు సాగిన తన కోలుకునే ప్రయాణం గురించి ఆమె వివరించారు.

"ప్రజలు నా ముఖం గురించే మాట్లాడారు. కానీ దెబ్బతిన్నది ముఖం మాత్రమే కాదు, నా శరీరం మొత్తం తీవ్రంగా ప్రభావితమైంది. నేను చాలా బాధ అనుభవించాను" అని అను తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "సంపూర్ణ ఓర్పు, అంగీకారం, సంతోషంతో నన్ను నేను బాగుచేసుకోవడానికి అంకితమయ్యాను. శరీరం మొత్తం దెబ్బతినడంతో, కోలుకోవడానికి చాలా సమయం పట్టింది" అని ఆమె తెలిపారు.

"యోగా, క్రమశిక్షణ, ఓపిక, మైండ్‌ఫుల్ లివింగ్, దైవశక్తిపై నమ్మకం వంటివే నన్ను అద్భుతంగా కోలుకునేలా చేశాయి. ప్రకృతితో మమేకమవడం, ముఖ్యంగా నవరాత్రుల సమయం నా ఆరోగ్యం మెరుగుపడటానికి చాలా సహాయపడింది. నా సంపూర్ణ స్వస్థతకు ఇదే పునాది" అంటూ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

1990లో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ 'ఆషికీ'తో అను అగర్వాల్ ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారారు. ఈ సినిమా భారీ విజయంతో ఆమె 'ఆషికీ గర్ల్'గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత 'కింగ్ అంకుల్', 'రిటర్న్ ఆఫ్ జువెల్ థీఫ్' తిరుడా తిరుడా (తెలుగులో దొంగ దొంగ) వంటి చిత్రాలలో నటించారు.

కానీ 1999లో జరిగిన కారు ప్రమాదం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ ప్రమాదంలో ఆమె కొన్ని వారాల పాటు కోమాలో ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆమె పూర్తిగా నటనకు, వెండితెరకు దూరమయ్యారు. చాలా సంవత్సరాలుగా ప్రజల కంటికి కనిపించకుండా ఉన్న అను, ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఆరోగ్యం, ఆధ్యాత్మికత, సంపూర్ణ జీవనశైలి వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.




More Telugu News