Rajinikanth: రజనీకాంత్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన టీవీకే నేత

Rajinikanth Adhav Arjun Apologizes for DMK Allegations
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన వ్యాఖ్యలపై నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ వెనక్కి తగ్గింది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను డీఎంకే బెదిరించి రాజకీయాల నుంచి దూరం చేసిందంటూ ఆ పార్టీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి ఆదావ్ అర్జున చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.

"వేరే ఉద్దేశంతో నేను చేసిన వ్యాఖ్యలు రజనీ సర్‌ను బాధపెట్టి ఉంటే, అందుకు బహిరంగంగా విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరుతున్నాను" అని ఆదావ్ అర్జున త‌న‌ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, తన పాత ఆరోపణలకు ఆయన కొత్త భాష్యం చెప్పారు. డీఎంకే నేరుగా బెదిరించలేదని, కానీ "పరువు నష్టం కలిగించే, వ్యక్తిగత, హుందాతనం లేని ప్రచారాల" ద్వారా బయటి నుంచి తీవ్ర ఒత్తిడి సృష్టించిందని ఆరోపించారు. "వారు అలాంటి వాతావరణాన్ని సృష్టించారు. దానినే నేను బెదిరింపు అని పేర్కొన్నాను" అని వివరణ ఇచ్చారు.

ఈ వివాదంపై రజనీకాంత్ స్వయంగా స్పందించారు. ఆదావ్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు. "కాలం మాట్లాడదు.. కానీ వేచి చూసి సమాధానం చెబుతుంది" అంటూ తనదైన శైలిలో గట్టిగా బదులిచ్చారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, రజనీకాంత్ 2020లో ఆరోగ్య కారణాలు, కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ వివాదం తమిళనాడులో రాజకీయంగా వేడి పుట్టించింది. టీవీకేను తమ కూటమిలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్న అన్నాడీఎంకే, బీజేపీలు.. ఆదావ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. రాజకీయాలకు అతీతంగా రజనీకాంత్‌కు గౌరవం ఉందని, ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ హుందాతనం కాదని అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి అన్నారు. ఆదావ్ ఆరోపణలు కేవలం భ్రమ అని, దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉన్న రజనీకాంత్ మానసిక స్థైర్యం గొప్పదని బీజేపీ నేత అన్నామలై పేర్కొన్నారు.

క్షమాపణ చెప్పినప్పటికీ, ఆదావ్ తన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు. తమ పార్టీకి రజనీకాంత్‌పై ద్వేషం లేదని, కేవలం ప్రేమే ఉందని అన్నారు. అదే సమయంలో ఎంజీఆర్, విజయకాంత్, వైగో వంటి నేతలపై డీఎంకే గతంలోనూ ఇలాంటి దుష్ప్రచారాలు చేసిందని తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. పొత్తుల ఊహాగానాలకు తెరదించుతూ, టీవీకే రాష్ట్రంలోని 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మొత్తం వివాదాన్ని అధికార డీఎంకే సృష్టించిందని ఆరోపించారు. దీనిపై డీఎంకే ఇంకా స్పందించలేదు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Go Back to Shorts
Rajinikanth
Tamil Nadu politics
TVK party
Vijay Thalapathy
DMK allegations
Adhav Arjun apology
political pressure
Tamil Assembly elections
MK Stalin
AIADMK BJP

More Telugu News