తోపుడు బండితో తెలంగాణ అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు... అడ్డుకున్న భద్రతా సిబ్బంది

తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీ వద్ద వినూత్న నిరసనకు దిగారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయాలని, రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, రైతుల నుంచి సేకరించిన వినతిపత్రాలను ఓ తోపుడు బండిపై పెట్టుకుని అసెంబ్లీకి చేరుకున్నారు.

ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, పాయల్ శంకర్ నాయకత్వంలో, వారి మద్దతుదారులతో కలిసి అసెంబ్లీ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం నుంచి నిరసన ప్రారంభించారు. ఫసల్ బీమాను అమలు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రైతుల వినతులను ప్రభుత్వానికి అందజేసి, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని వారు తెలిపారు. అయితే, అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. తోపుడు బండిని లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. వినతిపత్రాలను తమకు అందజేస్తే, సంబంధిత అధికారులకు చేరవేస్తామని భద్రతా సిబ్బంది హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలని, రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేయాలని, రైతు భరోసా నిధుల విడుదలలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి బడ్జెట్‌లో ఫసల్ బీమా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వ పంటల బీమా పథకం కూడా అమలు కావడం లేదని విమర్శించారు.

ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రైతులను మోసం చేసిందని ఎమ్మెల్యే హరీశ్ అన్నారు. రైతు భరోసా పథకం కింద కూడా రైతులకు ఆర్థిక సాయం అందడం లేదని, తగిన సమయంలో ప్రభుత్వంపై రైతులు తమ ఆగ్రహాన్ని చూపిస్తారని హెచ్చరించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. రైతులు తమ సమస్యలను వివరిస్తూ ఇచ్చిన వినతిపత్రాలను ముఖ్యమంత్రికి అందజేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చామని మరో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.




More Telugu News