రేవంత్ తొలి సంతకం ఫైలు ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా?: కేటీఆర్

  • ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందన్న కేటీఆర్
  • రెండున్నరేళ్లు గడుస్తున్నా ఒక్క గ్యారెంటీకి కూడా ఆ దిశగా అడుగులు పడలేదని విమర్శ
  • తొలి సంతకం ఫైలు ఎక్కడుందో వెతకడానికి సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్
  • పదవులు ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్య
  • గవర్నర్ ప్రసంగంలో విశ్వసనీయత కనిపించలేదని ఎద్దేవా

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంధించిన విమర్శనాస్త్రాలు సభలో సెగలు పుట్టించాయి. ముఖ్యంగా 'ఆరు గ్యారంటీలు', వాటి చట్టబద్ధతపై ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


తొలి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తారని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఒక్క గ్యారంటీకి కూడా ఆ దిశగా అడుగులు పడలేదని కేటీఆర్ నిలదీశారు. రాహుల్ గాంధీ కూడా తొలి కేబినెట్ సమావేశంలోనే వీటికి చట్టపరమైన హామీ ఇస్తామని చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజు ఆరు గ్యారంటీలపై చేసినట్లు చెబుతున్న ఆ 'తొలి సంతకం' ఫైలు ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇటీవల ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆ ఫైలు కూడా ఏమైనా కాలిపోయిందా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆ మాయమైన ఫైలును వెతికి పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ బీఆర్ఎస్ తరపున అసెంబ్లీలో ‘ప్రైవేట్ మెంబర్ బిల్’ ప్రవేశపెడతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.


"పదవులు ఎవరికీ శాశ్వతం కాదు. పదేళ్లు అధికారంలో ఉన్న మేము ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్నాం. నేనే రాజు, నేనే మంత్రి అని మిడిసిపడ్డ వారు శాశ్వతంగా అదే స్థానంలో ఉండరు" అంటూ కేటీఆర్ చురకలు అంటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే పాలకులకు విలువ ఉంటుందని... నిన్నటి గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వానికి ఉండాల్సిన స్పష్టత, విశ్వసనీయత ఏమాత్రం కనిపించలేదని ఎద్దేవా చేశారు.


KTR
Revanth Reddy
Telangana Assembly
Six Guarantees
BRS
Congress
FSL Fire Accident
Rahul Gandhi
Telangana Politics

More Telugu News