Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా బ్రతికే ఉన్నాడు.. కానీ కదలలేని స్థితిలో! భారత ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక!

Mojtaba Khamenei Alive But Immobile Indian Intelligence Report
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బ్రతికే ఉన్నప్పటికీ, తీవ్ర గాయాలతో కదలలేని (ఇమ్మొబైల్) స్థితిలో ఉన్నారని భారత ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో ఓ కథనం వెలువడింది. ఆయన సంభాషణలు, బహిరంగ ప్రకటనలన్నీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కట్టుదిట్టమైన నియంత్రణలో ఉన్నాయని ఆ కథనం స్పష్టం చేసింది. ఈ పరిణామం ఇరాన్ నాయకత్వంపై, దేశ స్థిరత్వంపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది.

భారత ప్రభుత్వానికి చెందిన అత్యంత విశ్వసనీయ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం... ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్, మొజ్తబా తండ్రి అయిన అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఇదే దాడుల్లో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాల కారణంగా ఆయన ప్రస్తుతం కదలలేని స్థితిలో ఉన్నారు. దీంతో దేశంలో అస్థిరత ఏర్పడకుండా ఉండేందుకు ఐఆర్‌జీసీ రంగంలోకి దిగింది. మొజ్తబాతో పరిమిత సంప్రదింపులు జరుపుతూ, ఆయన పేరుతో సందేశాలను, సోషల్ మీడియా పోస్టులను అత్యంత జాగ్రత్తగా రూపొందించి విడుదల చేస్తోంది. దేశంలో అంతా సవ్యంగా ఉందనే భావన కల్పించేందుకే ఐఆర్‌జీసీ ఈ చర్యలు చేపడుతోందని నివేదిక పేర్కొంది.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ నివేదికకు బలాన్నిస్తున్నాయి. ఖమేనీ బ్రతికే ఉన్నారని, కానీ దాడుల్లో తీవ్రంగా గాయపడి రూపురేఖలు మారిపోయి ఉండొచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి తోడు, సుప్రీం లీడర్‌గా తన సొంత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా మొజ్తబా ఖమేనీ హాజరు కాలేదు. వేదికపై కేవలం ఆయన ఫోటోను మాత్రమే ప్రదర్శించడం ఆయన ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.

అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా ఖండించారు. మొజ్తబా ఖమేనీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఇవన్నీ అమెరికా సృష్టిస్తున్న అసత్య ప్రచారాలని కొట్టిపారేశారు. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులు, భారత ఇంటెలిజెన్స్ నివేదిక మాత్రం పరిస్థితి తీవ్రంగానే ఉందని సూచిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్‌లో నెలకొన్న ఈ నాయకత్వ సంక్షోభం పశ్చిమాసియా రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ప్రస్తుతం తాత్కాలికంగా ఐఆర్‌జీసీయే పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.


Mojtaba Khamenei
Iran
Supreme Leader
Ayatollah Ali Khamenei
IRGC
Iran Leader Health
US Israel Attacks
Iranian Politics
Middle East Crisis
Iran instability

More Telugu News