దుబాయ్ ఎయిర్‌పోర్ట్ క్లోజ్.. ఇరాన్ క్షిపణి దాడులతో గల్ఫ్ లో హైఅలర్ట్!

Iran Missile Attacks Trigger High Alert in Gulf Dubai Airport Closed
  • దుబాయ్, కువైట్ ఎయిర్‌పోర్టులపై ఇరాన్ క్షిపణి దాడులు!
  • ఎయిర్‌పోర్టుల్లో నిలిచిన విమాన సర్వీసులు
  • అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు
అమెరికా-ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం ఇరాన్ జరిపిన క్షిపణి దాడులతో దుబాయ్, కువైట్ నగరాలు దద్దరిల్లాయి. దుబాయ్‌లోని ప్రధాన ఆర్థిక కేంద్రాలు, మెరీనా, అల్ సుఫూహ్ వంటి నివాస ప్రాంతాలలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో క్షిపణి శకలాలు పడటంతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. క్షిపణి శకలాలు పడటంతో విమానాశ్రయ రన్ వే దెబ్బతిన్నట్లు సమాచారం. కువైట్‌లోని అహ్మద్ అల్-జాబర్ ఎయిర్ బేస్‌పై కూడా డ్రోన్ల దాడి జరిగినట్లు కువైట్ రక్షణ శాఖ ధృవీకరించింది. ఈ దాడుల్లో పలువురు కువైట్ సైనికులు గాయపడ్డారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తన గగనతలంలోకి దూసుకొచ్చిన 9 బాలిస్టిక్ క్షిపణులను, 33 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు ప్రకటించింది. అయితే, క్షిపణి శకలాలు దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్ వంటి ప్రముఖ కట్టడాల సమీపంలో పడటంతో స్వల్ప నష్టం వాటిల్లింది. ఇరాన్‌లోని ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా జరిపిన బాంబు దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్ జీసీ) ప్రకటించాయి. ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల గగనతలం మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.
Go Back to Shorts
Dubai Airport
Iran
Missile Attacks
Kuwait Airport
UAE
Middle East Conflict
Gulf Tensions
Ahmad Al-Jaber Air Base
Burj Al Arab
IRGC

More Telugu News