రెండు నిమిషాలు ఆలస్యమైందని ఒకటో తరగతి పిల్లాడికి కఠిన శిక్ష

స్కూల్‌కు కేవలం రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో ఒకటో తరగతి విద్యార్థిని సుమారు రెండు గంటల పాటు ఎండలో నిలబెట్టి శిక్షించిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. ఈ అమానవీయ ఘటనపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో పోలీసులు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బెంగళూరులోని యలహంక అత్తూరు లేఅవుట్‌లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. బాధితుడైన విద్యార్థి రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో, పాఠశాల సిబ్బంది అతడిని ఎండలో నిలబెట్టారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ తమతో దురుసుగా, అహంకారంగా ప్రవర్తించారని తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో వైరల్ కావడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియోపై స్పందించిన బెంగళూరు నగర పోలీసులు ఘటనను తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. జువైనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015 కింద కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. "పిల్లలను శారీరకంగా లేదా మానసికంగా హింసించడం శిక్షార్హమైన నేరం" అని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. చట్టప్రకారం బాలుడి గుర్తింపును వెల్లడించే వీడియోలు, ఫోటోలను షేర్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఈ ఘటనపై పాఠశాల యాజమాన్య ప్రతినిధి ఒకరు స్పందించారు. తల్లిదండ్రులు, బంధువులు రెచ్చగొట్టడంతో ప్రిన్సిపాల్ అలా ప్రవర్తించి ఉండొచ్చని, అయితే ఆమెపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు.  


More Telugu News