నేడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నేడు ప్రకటించనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికల తేదీలను ఈరోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో అధికారులు వెల్లడించనున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగనుంది.

ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందాలు పర్యటించి భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సన్నద్ధతను సమీక్షించాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ఎన్ని దశల్లో జరుగుతాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ విడుదలైన నిమిషం నుంచే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లోకి రానుంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 37 రాజ్యసభ స్థానాలకు కూడా మార్చి 16న పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ఇప్పటికే వెల్లడించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండడంతో దేశంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 4 గంటలకు వెలువడనున్న అధికారిక ప్రకటనతో ఎన్నికల సమరం ఏ రోజు ప్రారంభమవుతుందనే విషయంపై స్పష్టత రానుంది.


More Telugu News