Satyaveni: షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. కన్నబిడ్డల గొంతు నులిమి తల్లి ఆత్మహత్య

Satyaveni Suicide Mother Kills Children Over Shopping Dispute in Hyderabad
హైదరాబాద్‌లోని బోరబండలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ పెళ్లి రోజున భర్త షాపింగ్‌కు తీసుకెళ్లలేదన్న మనస్తాపంతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి, ఆపై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఆమె రెండేళ్ల కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. బోరబండ పెద్దమ్మనగర్‌లో నివసించే మురళి వేణు, సత్యవేణి (30) దంపతులకు కుమారుడు రుద్రాన్ష్ (5), కుమార్తె ధన్విక (2) ఉన్నారు. భర్త మురళి విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వారి పెళ్లి రోజు కావడంతో షాపింగ్‌కు వెళ్దామని సత్యవేణి భర్తను కోరింది. అయితే, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన తండ్రిని డయాలసిస్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాలని, మరోరోజు వెళ్దామని మురళి నచ్చజెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

భర్త తన తండ్రిని తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన తర్వాత సత్యవేణి దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకుని, టీవీ సౌండ్ పెద్దగా పెట్టింది. అనంతరం పిల్లలిద్దరి గొంతు నులిమి, ఆ తర్వాత తానూ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన అత్త మంగాదేవి ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా, కోడలు ఉరి వేసుకుని కనిపించింది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా, అప్పటికే సత్యవేణి, కుమారుడు రుద్రాన్ష్ మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న చిన్నారి ధన్వికను వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. సత్యవేణి మృతికి ఆమె భర్త, అత్తమామలే కారణమని మృతురాలి వదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Satyaveni
Hyderabad
Borabanda
Suicide
Family dispute
Child murder
Niloufer Hospital
Gandhi Hospital
Telangana
Crime news

More Telugu News