మూసీ ప్రాజెక్టు... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

ఖజానాలో డబ్బులు లేవంటూనే, వేలకోట్ల రూపాయలతో మూసీ ప్రాజెక్టును చేపడతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారం చాలా వింతగా ఉందని అన్నారు. తినడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా ఆయన తీరు ఉందని ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్లు దండుకుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఒకవైపు చెబుతూనే, మరొకవైపు మూసీ ప్రాజెక్టును చేపడతానని చెప్పడమేమిటని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీ సుందరీకరణ చేపట్టారని వెల్లడించారు. అసలు మూసీ మురికి కూపంగా మారింది కాంగ్రెస్ హయాంలోనే అని ముఖ్యమంత్రి గుర్తించాలని అన్నారు. మూసీ పునరుజ్జీవంపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన సమయంలో, మూసీ బాధితులకు ఉపశమనం ఇచ్చే ప్రకటన ఏదైనా చేస్తారా అని చూశామని, కానీ ఆ ప్రస్తావనే లేదని విమర్శించారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవని ముఖ్యమంత్రి చెబుతున్నారని, రైతుబంధు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇచ్చేందుకు డబ్బులు లేవని చెప్పారని, కానీ ఇప్పుడు మూసీ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. 2 వేల కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్టు ఖర్చు రూ.42,500 కోట్లు అని, గుజరాత్ సబర్మతికి అయిన ఖర్చు రూ.7 వేల కోట్లు అని గుర్తు చేశారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. అందాల పోటీలు నిర్వహించడానికి రూ.200 కోట్లు ఖర్చు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, హామీల అమలుకు మాత్రం డబ్బులు లేవంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఒక్క ఇంటినైనా నిర్మించిందా అని ప్రశ్నించారు.


More Telugu News