బండి సంజయ్ పాదయాత్రలో... డ్రోన్ తగిలి తేనెటీగల దాడి

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా తేనెటీగలు దాడి చేశాయి. 'అంజన్న ఆశీర్వాద యాత్ర' పేరిట కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు చేపట్టిన పాదయాత్రలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రామడుగు మండలం కోన్‌రావుపేట సమీపంలో పాదయాత్ర దృశ్యాలను చిత్రీకరించేందుకు పలువురు అభిమానులు డ్రోన్ ఎగురవేశారు.

అది పక్కనే ఉన్న చెట్టుకు ఉన్న తేనెతుట్టెకు తగిలింది. దీంతో తేనెటీగలు లేచి, పలువురు కార్యకర్తలపై దాడి చేశాయి. తేనెటీగల దాడితో కార్యకర్తలు భయాందోళనకు గురయ్యారు. తేనెటీగలు నలుగురు కార్యకర్తలపై దాడి చేశాయి. అప్రమత్తమైన బండి సంజయ్, ఆయన సిబ్బంది వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాదయాత్రకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.

అనంతరం వైద్యులు బండి సంజయ్‌కి రొటీన్ వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ అంజన్న ఆశీర్వాద యాత్ర కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్లు కొనసాగుతుంది. ఉదయం ప్రారంభమైన ఈ యాత్ర సాయంత్రానికి చేరుకుంటుంది.


More Telugu News