బీఆర్ నాయుడు విషయంలో చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు?: లక్ష్మీపార్వతి
కూటమి ప్రభుత్వంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ... అలాంటి వ్యక్తులను పవిత్రమైన పదవుల్లో ఎలా నియమిస్తారని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. దేవుడితో ఆడుకోవడం సరికాదని, మహిళలకు అన్యాయం చేసిన వారికి చరిత్రలో ఎలాంటి గతి పట్టిందో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం మహిళలను అడ్డం పెట్టుకుంటున్నారని, ఇప్పుడు మేకతోలు కప్పుకుని మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో మహిళల భద్రత పూర్తిగా గాలికి వదిలేశారని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయని లక్ష్మీపార్వతి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రస్తుతం 'అత్యాచారాల ఆంధ్రప్రదేశ్'గా మారిపోయిందని, సామాన్యులే కాకుండా ప్రజాప్రతినిధులుగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ పాపాలను పంచుకోవడంలో జనసేన పార్టీ కూడా భాగస్వామి అవుతోందని విమర్శించారు.
పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి, వారిని కేవలం అధికార పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా మహిళలకు తక్షణ రక్షణ లభించేదని, కానీ నేడు ఆడపిల్లలను స్కూళ్లకు పంపాలన్నా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.