Narendra Modi: ఫలించిన దౌత్యం.. హార్ముజ్ దాటనున్న మరిన్ని భారత ట్యాంకర్లు

Indian Tankers to Navigate Hormuz Strait After Modi Iran Talks
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నడుమ హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు మార్గం సుగమమైంది. ఇప్పటికే రెండు ఎల్పీజీ నౌకలు ఈ ప్రాంతాన్ని సురక్షితంగా దాటిన నేపథ్యంలో, మరిన్ని భారత ట్యాంకర్లు ఈ కీలక జలమార్గాన్ని దాటేందుకు సిద్ధంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు శనివారం తెలిపాయి. భారత నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని ఇరాన్ హామీ ఇవ్వడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చల ఫలితంగా రవాణాకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ రంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన 'శివాలిక్', 'నందా దేవి' అనే రెండు చమురు ట్యాంకర్లు ఇప్పటికే భారత్‌కు బయల్దేరాయి. మరో రెండు రోజుల్లో ఇవి ముంబై లేదా కాండ్లా పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది. 'శివాలిక్' నౌకకు భారత నౌకాదళం భద్రత కల్పిస్తోంది. 'నందా దేవి' నౌక 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వస్తోంది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీఎస్) మార్చి 12 నాటి సమాచారం ప్రకారం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మొత్తం 28 భారత నౌకలు ఉన్నాయి. వీటిలో 778 మంది భారత సిబ్బంది ఉన్నారు. ఈ నౌకల్లో సుమారు 2.15 లక్షల టన్నుల ఎల్ఎన్‌జీ, 4.15 లక్షల టన్నుల ఎల్పీజీ, 17.5 లక్షల టన్నుల ముడి చమురు ఉంది. ఈ నౌకల భద్రతను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది.

ప్రపంచంలోని చమురు, గ్యాస్ ఎగుమతుల్లో 20 శాతం హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతాయి. భారత నౌకలకు త్వరలోనే సురక్షిత మార్గం లభిస్తుందని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలీ శుక్రవారం సూచించిన సంగతి తెలిసిందే.
Narendra Modi
Iran
Hormuz Strait
Indian tankers
oil tankers
LPG tankers
shipping
India Iran relations
maritime security
Persian Gulf

More Telugu News