ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌కు హ్యాండిచ్చిన స్టార్ బౌలర్.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన‌ పీసీబీ

ఐపీఎల్ మరోసారి పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)కు గట్టి షాకిచ్చింది. జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ, పీఎస్ఎల్ ఒప్పందాన్ని కాదని ఐపీఎల్‌లో ఆడేందుకు మొగ్గు చూపడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల‌ 26 నుంచి ప్రారంభం కానున్న పీఎస్ఎల్ సీజన్ 11 కోసం ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు ముజరబానీని రూ.1.1 కోట్లకు (పాకిస్థాన్ కరెన్సీ) కొనుగోలు చేసింది. అయితే, చివరి నిమిషంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నుంచి అతనికి పిలుపు వచ్చింది. బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో కేకేఆర్ అతడిని భర్తీ ఆటగాడిగా ఎంచుకోవడంతో ముజరబానీ పీఎస్ఎల్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు.

పీఎస్ఎల్‌కు ఇలాంటి అనుభవం ఎదురవడం ఇది మొదటిసారి కాదు. గతేడాది కూడా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్, పెషావర్ జల్మీకి ఎంపికైన తర్వాత ముంబై ఇండియన్స్‌కు మారాడు. దీంతో పీఎస్ఎల్ నిర్వాహకులు అతనిపై ఏడాది పాటు నిషేధం విధించారు. ఇప్పుడు ముజరబానీ విషయంలో కూడా పీసీబీ కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో ముజరబానీ అద్భుతంగా రాణించాడు. టోర్నీలో 13 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అతని ప్రదర్శనతోనే జింబాబ్వే జట్టు సూపర్-8 దశకు చేరుకోగలిగింది. ఈ నేపథ్యంలోనే అతనిపై ఫ్రాంచైజీల ఆసక్తి పెరిగింది.


More Telugu News