Revanth Reddy: వారి జోలికి వెళితే మళ్లీ అధికారంలోకి రాలేమని మాకు తెలుసు: రేవంత్ రెడ్డి

Revanth Reddy We Know We Wont Come Back to Power If We Go Against the Poor
పేదల జోలికి వెళితే మాకు మళ్లీ అధికారం వస్తుందా, అలాంటప్పుడు మేం పేదలకు అన్యాయం ఎందుకు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదలకు మేం మంచి చేస్తే, తాము అధికారంలోకి రాలేమని ప్రతిపక్ష నాయకులకు భయం పట్టుకుందని విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మూసీ ఇన్వైట్స్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

మూసీ అభివృద్ధిని బాధ్యతాయుతంగా చేపట్టాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు. రెండేళ్లుగా అధికారులతో క్షుణ్ణంగా ప్రతి అంశం పరిశీలించాకే ముందడుగు వేస్తున్నామని తెలిపారు. వందేళ్ల క్రితం నిర్మించిన జలాశయాలు ఇప్పటికీ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ వంటి ప్రాజెక్టులకు కొంతమంది అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

మూసీ, ఈసా సంగమ స్థానం లంగర్ హౌస్ వద్ద బాపూఘాట్‌ను పర్యాటక కేంద్రంగా చేస్తామని అన్నారు. మూసీ, గోదావరి జలాలతో ప్రజల దాహార్తిని తీర్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఘనమైన చరిత్ర కలిగిన మూసీ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను అడ్డుకోవద్దని కోరారు.

పాతబస్తీలో మెట్రో, రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో చెరువులను పునరుద్ధరిస్తున్నామని, ప్రజలు కూడా తమను స్వాగతిస్తున్నారని తెలిపారు. మూసీ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారు ఇప్పుడు అదే కాలువ పక్కన నివసించగలుగుతారా అని ప్రశ్నించారు. అలాంటి వారికి కంటైనర్‌లు ఇస్తానని, నివసించాలని సవాల్ చేశారు.

మూసీ ప్రక్షాళన చేయకపోతే నల్గొండ తీవ్రంగా దెబ్బతింటుందని, భవిష్యత్తు తరాలు కోలుకోలేని విధంగా నష్టపోతాయని అన్నారు. అన్నింటిని పరిగణనలోకి తీసుకుని మూసీ ప్రాజెక్టుపై ముందుకు వెళుతున్నామని అన్నారు. శుక్రాచార్యుడు, ఆయన శిష్యులు నిత్యం యజ్ఞాలను భగ్నం చేసేవారని, కానీ దేవుళ్లు ఆ యజ్ఞాలను ఆపకుండా కొనసాగించారని అన్నారు. ప్రజల మంచి కోసం ప్రాజెక్టులపై తాము కూడా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. తాను హిందువునని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని తెలిపారు. వేరే మతాలను కూడా గౌరవిస్తానని అన్నారు.

హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్‌లా మారిపోయిందని ముఖ్యమంత్రి అన్నారు. తన ఇంట్లో 1,300 ఫీట్లు వేస్తే కానీ బోరులో నీళ్లు రాలేదని చెప్పారు. అండర్ గ్రౌండ్ వాటర్ పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో 10 వేల కుటుంబాలు ఉన్నాయని, ప్రక్షాళన నేపథ్యంలో ఒక్కో కుటుంబానికి ఎంత ఇద్దామో ప్రతిపక్షాలు చెప్పాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ఇప్పటికే రూ.10 వేల బెడ్రూంలు ఇచ్చామని తెలిపారు.

పేద ప్రజలతో తాను శత్రుత్వం ఎందుకు పెంచుకుంటానని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వారితో కంటతడి పెట్టించాల్సిన అవసరం తనకేమిటని అన్నారు. పేదలకు మంచి చేస్తేనే మళ్లీ అధికారంలోకి వస్తామనే విషయం తనకు తెలుసని అన్నారు. దుబాయ్ కంటే హైదరాబాద్ సురక్షితమైన ప్రాంతమని ఆయన అన్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా అబద్ధాల వేదిక అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ సరోవర్‌కు రూ.200 కోట్లు కేటాయిస్తుంటే రూ.5 వేల కోట్లు అని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు గొప్ప గొప్ప చదువులు చదువుకోవచ్చు, నేను ప్రభుత్వ కాలేజీలో చదువుకోవచ్చు, కానీ అన్నీ నేర్చుకుంటున్నానని ముఖ్యమంత్రి అన్నారు.

అయినా అభివృద్ధి వద్దని మీరంతా చెబితే ఆపేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. మీకు అవసరం లేని అభివృద్ధి నాకెందుకని ప్రశ్నించారు.  తాను మంచికి ప్రతినిధిగా కావాలనుకుంటున్నానని అన్నారు. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తనకు వచ్చిందని, రెండు మంచి పనులు చేయాలనే ఆలోచనతో ఉన్నానని అన్నారు.  గాంధీని చంపిన వాళ్లు కూడా ఈరోజు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
Revanth Reddy
Telangana
Moosi River
Hyderabad
Riverfront Development
Congress Party
Telangana Politics

More Telugu News