వంట గ్యాస్‌పై ఆందోళన... కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి

KTR Requests Center to Intervene on LPG Cylinder Shortage
  • కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరికి కేటీఆర్ లేఖ
  • హైదరాబాద్ సహా తెలంగాణలో 90 శాతం హోటళ్లు మూతబడతాయని ఆందోళన
  • గ్యాస్ కేటాయింపుల్లో చిన్న వ్యాపారులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కేటీఆర్
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో, ఎల్పీజీ సిలిండర్ల కొరతపై వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు. గృహ అవసరాల కోసం ఎల్పీజీ సిలిండర్ల కొరతను సమన్వయంతో పునరుద్ధరించాలని కోరారు. గ్యాస్‌ కొరత కారణంగా హోటళ్లు, హాస్టళ్లు ఎదురొంటున్న సంక్షోభ నివారణకు తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గ్యాస్‌ సరఫరాను పునరుద్ధరించకపోతే హైదరాబాద్‌ సహా తెలంగాణవ్యాప్తంగా దాదాపు 90 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు 48 గంటల్లో మూతపడే ప్రమాదం ఉందని రాష్ట్రంలోని హోటల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ పీజీ హాస్టళ్లలో నివసించే లక్షలాది మంది విద్యార్థులు, వరింగ్‌ ప్రొఫెషనల్స్‌కు భోజనానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

గ్యాస్ కేటాయింపుల్లో పెద్ద పెద్ద సంస్థల కంటే చిన్న చిన్న వ్యాపారులు, సంస్థలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ సంక్షోభం ముగిసేవరకు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగకుండా నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. గ్యాస్ లభ్యతపై ప్రజల్లో ఉన్న అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఇందుకోసం జిల్లాస్థాయి పంపిణీ వివరాలతో కూడిన పబ్లిక్ డ్యాష్ బోర్డును అందుబాటులోకి తేవాలన్నారు.

గృహ అవసరాల కోసం రావాల్సిన సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆ లేఖలో కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. హోటల్ రంగంపై 80 లక్షలమంది దినసరి కూలీలు ఆధారపడి బతుకుతున్నారని, వారికి ఉపాధికి గ్యారెంటీ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం మాటలతో సరిపెట్టకుండా తక్షణమే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
KTR
KT Rama Rao
Telangana
LPG shortage
Gas cylinders
Hardeep Singh Puri
Hotel association

More Telugu News